కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు

16 Oct, 2020 20:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో అరెస్ట్‌అయిన కీసర తహసీల్దార్‌ నాగరాజు జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ ఈనెల 14న  చంచల్‌గూడ జైల్లో టవల్‌తో ఉరివేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్‌ డెత్‌గా కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యనని, సీబీఐ విచారణ కోరుతు హైకోర్టులో పిటీషన్ వేస్తాము తెలిపారు. (కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య)

ఈ మేరకు శుక్రవారం నాగరాజు కుటుంబ సభ్యులు సాక్షి మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘ఎంతోమంది ఖైదీలు ఉండే జైల్లో ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. అదీ టవల్‌తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు..? పక్కన ముగ్గురు ఖైదీలు వున్నారు. ఆ సమయంలో వాళ్లేంచేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదు. అందుకు తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికే సీసీ వీడియో ఏసీబీ కోర్టుకి ఇచ్చాము. ధర్మారెడ్డికి భూమి మ్యూటేషన్ కేసులో ఏతప్పు చేయలేదు. రికార్డుల ప్రకారమే నాగరాజు వ్యవహరించారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో ఇరికించారు. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. చనిపోడానికి ముందు ఉదయం మాతో ఫోన్లో మాట్లాడాడు. త్వరలోనే వచ్చేస్తున్నా.. ధైర్యంగా ఉండమని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు ఇలాంటి కేసులు సహజం. న్యాయపరంగా బయటకువచ్చాక పోరాటం చేద్దామన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు. మా అందరికీ ఆయనే దిక్కు. మా పరిస్థితి ఏంటీ’అని ప్రశ్నించారు. 

మరోవైపు నాగరాజు చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడారు, ఏం చెప్పారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు