కేంద్రీయ విద్యాలయం పిలుస్తోంది 

4 Aug, 2020 08:13 IST|Sakshi
ఝరాసంగంలోని కేంద్రీయ విద్యాలయం

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి  శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే 2020–2021 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాల ప్రక్రియ ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌  వెలువరించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ జూలై  20 నుంచే ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఉంది.  దీంతో పాటు 2వ, 8వ, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల  స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.  

సాక్షి, కొండాపూర్‌(సంగారెడ్డి): వివిధ రంగాలలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలతో పాటుగా ఇతరుల పిల్లలకు ప్రాధాన్యతలను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అవి రెండు కూడా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోనే ఉండగా, అందులో ఒకటి ఝరాసంగం మండల కేంద్రం కాగా, మరొకటి ఎద్దు మైలారం (ఓడిఎఫ్‌)లో ఉంది. 

వీరికే మొదటి ప్రాధాన్యత 
ఆర్మీ ఉద్యోగుల బదిలీలను దృష్టిలో ఉంచుకొని వారి పిల్లల చదువులకు ఆటంకం కలుగకుండా ఉండాలనే ఆలోచనతో మొదటగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగుల పిల్లలకే కాకుండా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగులు, వాటి అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు కూడా వీటిలో ప్రవేశాలను కల్పిస్తున్నారు. ప్రవేశాలు పొందే విద్యార్థి మార్చి 31 నాటికి 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వికలాంగ విద్యార్థుల మాత్రం రెండేళ్ల సడలింపు ఉంటుంది. ఇందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం చొప్పున , తాజా ప్రవేశాలలో మూడు శాతం సీట్లు దివ్యాంగులకు రిజర్వు చేస్తారు.  

ఎంపిక విధానం.. 

  • ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్రీయ విద్యాలయం సంఘటన్‌ (కేవీఎస్‌) నుంచి 80 మంది విద్యార్థుల ఎంపిక జాబితా నేరుగా విద్యాలయానికి పంపుతారు.ఆ జాబితాను కేవీఎస్‌ అధికారులు సంబందిత వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. 
  • లిస్ట్‌లో ఉన్నవారు మాత్రమే తమ రిజినల్‌ సర్టిఫికేట్‌లతో కేవీలో సంప్రదించి ప్రవేశాలను పొందాల్సి ఉంటుంది. 
  • ఎలాంటి డ్రా అయిన చైర్మన్‌ సూచించిన అధికారితో పాటుగా వీఎంసీ మెంబర్, ప్రిన్సిపాల్‌ నూతనంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ( వీరిలో ఒకరు విద్యా హక్కు చట్టం ప్రకారం సీటు పొందే వారు). ఒక విద్యార్థి సమక్షంలో ఎంపిక నిర్వహిస్తారు.  

షెడ్యూల్‌  ఇలా..

  • జూలై 20వ తేదీ నుంచి 1వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో నమోదు 
  • ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నమోదు చేసుకొనే అవకాశం 
  • 11న ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన ప్రొవిజినల్‌ తొలి జాబితా ప్రకటన 
  • సీట్లు ఏమైనా మిగిలి ఉంటే ఈనెల 24న రెండో జాబితా విడుదల రెండో విడతలో సీట్లు భర్తీ కాని పక్షంలో మూడో జాబితా  26న విడుదల  
  • మొదటి నోటిఫికేషన్‌లో దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగకపోయినా, దరఖాస్తులు ఎక్కువగా రాకపోయినా రెండో నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 


దరఖాస్తు చేసుకునే విధానం  

  • http://kvsonlineadmission.kvs.gov.in & http://tlm4all.com ద్వారా లాగిన్‌ కావాలి. 
  • కేంద్రీయ విద్యాలయంలో సాధారణంగా ప్రతీఏడాది ఒకటో తరగతికి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అడ్మిషన్‌లు ఇస్తారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విద్యాలయాల ప్రారంభంపై సందిగ్ధత ఉండడంపై జాప్యం జరిగింది. 
  • రెండు సెక్షన్‌లలో 40 మంది విద్యార్థులకు చొప్పున 80 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. 
  • రిజిష్ట్రేషన్‌ కోసం పుట్టిన తేదీ, కులం, నివాసం, వృత్తి ధ్రువీకరణ పత్రాల సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. 
  •  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దారిద్య్ర రేఖకు దిగువన కోటాలో దరఖాస్తు చేసుకొనే వారు ధ్రువీకరణ పత్రం సంఖ్యను నమోదు చేయాలి.పీహెచ్‌సీలు తప్పనిసరిగా దివ్యాంగ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. 
  • ఔబీసీలు తప్పనిసరిగా ఓబీసీ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. 
  • ఒకే సంతానం (కూతురు) గల వారు నేరుగా విద్యాలయంలోనే దరఖాస్తు చేసుకునే వీలుంది.ఈ కోటాలో సెక్షన్‌కు ఇద్దరు చొప్పున నలుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. మరో సంతానం లేనట్లుగా నోటరీ ద్వారా జారీ చేసిన ఆఫిడవిట్‌ను అందజేయాలి. ఒక వేళ ఈ కోటాలో ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా పద్ధతిన ఎంపిక చేస్తారు.  
మరిన్ని వార్తలు