అవి రాజ్యాంగ వ్యతిరేకం

4 Feb, 2021 08:12 IST|Sakshi

వ్యవసాయ చట్టాలపై కె.కేశవరావు

సాగు రాష్ట్రాల పరిధిలోని అంశం

చట్టాల రద్దు డిమాండ్‌తో ఏకీభవించను

ఎమ్మెస్పీ హామీని చట్టంలో చేర్చడంలో ఉన్న అభ్యంతరమేంటి?

ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్న ఎంపీ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, సాగు అనేది రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వ్యాఖ్యానించారు. అయితే ఈ చట్టాలను మొత్తానికే రద్దు చేయాలని రైతులు తీసుకున్న దృఢ వైఖరిని తాను అంగీకరించడం లేదన్నారు. రైతులు కోరుతున్న సవరణలు సమ్మతించదగినవని పార్లమెంటు భావించినప్పుడు ఆ మేరకు సవరణలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మన దేశంలో మొదటి విడత ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ తెచ్చిన రెండు సంస్థలకు, సైంటిస్టులకు అభినందనలు. మనం చక్కటి బడ్జెట్‌ చూశాం. ఆరోగ్య రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. అయితే మందుల సరఫరా, వైద్య సిబ్బంది తగినంతగా లేరు. దీనిపై దృష్టిపెట్టాలి.

ఈరోజు దేశంలో రగులుతున్న సమస్యపై నాకు కూడా ఆందోళన ఉంది. రైతుల ఉద్యమం గురించి నేను మాట్లాడుతున్నాను. మనం మరికొంత ప్రజాస్వామికంగా, ఇంకాస్త సర్దుబాటు, ఔదార్యంతో వ్యవహరించే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. బిల్లులు గందరగోళం మధ్య ఆమోదం పొందాయి. సభ్యుల ఆందోళనల నడుమ సవరణలు ప్రతిపాదించే అవకాశం కూడా లేకుండాపోయింది. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం మద్దతు ధరకు (ఎమ్మెస్పీకి) సిద్ధంగా ఉన్నామని చెబితే.. దానిని చట్టంలో పెట్టడంలో ఉన్న అభ్యంతరమేంటి? పలు అంశాల పట్ల తాము సానుకూలమని ప్రభుత్వం సమాధానం ఇస్తోంది.

అయితే అనేక అంశాలకు ఇంకా పరిష్కారం దొరకలేదని రైతు నాయకులు చెబుతున్నారు. అపరిష్కృత అంశాలేమిటో మనకు తెలియడం లేదు. అందువల్ల వీటిని పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉంది. చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు తీసుకున్న దృఢమైన వైఖరిని నేను అంగీకరించడం లేదు. ఒకవేళ రైతులు కోరుకున్న మార్పులు హేతుబద్ధంగా ఉంటే, అవి వాస్తవమేనని సభ అంగీకరిస్తే, ఆ మేరకు సవరణలు చేయాలి. ఆనాడు సెలెక్ట్‌ కమిటీకి పంపి ఉంటే సమస్య పరిష్కారమై ఉండేదని భావిస్తున్నా. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వడం కంటే... మనమే ఒక పరిష్కారం చూపడం మంచిదని భావిస్తున్నా’అని కేశవరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో... మార్కెట్‌ కమిటీలు కొనసాగుతాయని, కనీస మద్ధతు ధర కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఒకవేళ అవసరమైతే మేం దానికి చట్టం తెస్తాం’అని కేకే పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు