ప్రజారోగ్యం పట్ల కేంద్రమే చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి

26 Apr, 2021 19:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ విపత్ర పరిస్థితి ఏర్పడిప్పుడు కేంద్రం దాన్ని నేషనల్‌ ఎమర్జెన్సీగా భావించి, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి, ప్రజారోగ్యం పట్ల చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. కరోనా తీవ్రత ఉధృతంగా ఉన్నా, దాని నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని శనివారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రకటించినప్పటికీ టీకా దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. మొన్నటి వరకు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, ఇతర కారణాలతో కరోనా నేడే ఉగ్రరూపం దాల్చిందని మండిపడ్డారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కేతిరెడ్డి కోరారు.

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ మన దేశంలో విద్య, వైద్య రంగాలలో ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలుగాని, ప్రజారోగ్యం, విద్య పట్ల శ్రద్ధ వహించి ఉంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి మరణాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది. పౌరులు కూడా అప్రమత్తంగా ఉంటూ, కోవిడ్‌ నిబంధనలను పాటించి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కరోనా తీవ్రతను బట్టి అవసరమైతే లాక్‌డౌన్‌ను విధించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు