బీఎడ్‌ అన్నికోర్సులకు కామన్‌ పరీక్ష 

13 Apr, 2021 14:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేర్వేరు మెథడాలజీలకు వేర్వేరు ప్రశ్నపత్రాల విధానం రద్దు 

పదో తరగతి వరకున్న సిలబస్‌ ప్రామాణికంగానే ఎడ్‌సెట్‌ 

బీటెక్‌లో 50 శాతం మార్కులున్నా ప్రవేశాలకు అర్హులే.. 

ఓరియంటల్‌ లాంగ్వేజెస్, బీబీఏ వారికీ చేరే అవకాశం 

ఎడ్‌సెట్, బీఎడ్‌ ప్రవేశాల విధానాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సు బీఎడ్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) ప్రవేశాల విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారికి మాత్రమే బీఎడ్‌లో చేరే అవకాశం ఉండేది. ఇకపై వారితోపాటు కొత్త కొత్త కాంబినేషన్లతో డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా బీఎడ్‌ చదివే వీలు కలుగనుంది. ఇక బీఎడ్‌ మెథడాలజీ (సబ్జెక్టు) విషయంలోనూ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌లో ఒక్కో మెథడాలజీకి ఒక్కో ప్రశ్నపత్రం ఇచ్చి పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇకపై అన్ని మెథడాలజీలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారు.

ఇందులో అర్హత సాధించిన వారు.. తాము డిగ్రీలో చదివిన ఏ సబ్జెక్టుకు సంబంధించిన మెథడాలజీలోనైనా అడ్మిషన్‌ పొందవచ్చు. ఈ మేరకు బీఎడ్‌ ప్రవేశపరీక్ష నిబంధనల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సోమవారం జీవో 14 జారీ చేశారు. మరోవైపు ఎడ్‌సెట్‌లో ఇప్పటివరకు ప్రామాణికంగా డిగ్రీలోని సిలబస్‌ను తీసుకొని పరీక్షను నిర్వహిస్తుండగా, ఇకపై ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న సిలబస్‌ ఆధారంగానే ఎడ్‌సెట్‌ను నిర్వహించనుంది. 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో భాగంగా ఆగస్టులో నిర్వహించే ఎడ్‌సెట్‌ పరీక్షలో, బీఎడ్‌ ప్రవేశాలల్లో ఈ మార్పులను అమలు చేయనున్నట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ.రామకృష్ణ, ఓయూ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ వివరించారు. 

కొత్త సబ్జెక్టుల వారికి అవకాశం 
కొన్ని కొత్త సబ్జెక్టులు చదివినవారు కూడా ఈసారి బీఎడ్‌ చదివే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఓరియంటల్‌ లాంగ్వేజెస్, బీబీఏ చదివినవారు డిగ్రీలో సంబంధిత సబ్జెక్టు కలిగి ఉంటే బీఎడ్‌ చేయొచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్‌), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌), బీబీఏ, ఎంబీఏ, బీటెక్‌ చేసిన వారు కూడా బీఎడ్‌ చదవచ్చు. అయితే సంబంధిత సబ్జెక్టుల్లో వారు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

ప్రశ్నపత్రంలో మార్పులివీ.. 
సోషల్, సైన్స్, మేథమెటిక్స్, ఇంగ్లిషు.. ఇలా మెథడాలజీని బట్టి వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇకపై ఉండవు. అన్నింటికి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చేలా ప్రభుత్వం మార్పులు చేసింది. ఏ సబ్జెక్టులో బీఎడ్‌ చేయాలనుకున్నా కామన్‌ ప్రవేశపరీక్ష రాయాలి. పదో తరగతి వరకు అన్ని ప్రధాన సబ్జెక్టులపై పట్టును పరీక్షించేలా పరీక్ష ఉంటుంది. ఇందులో గణితం, సైన్స్, సోషల్‌లో 60 ప్రశ్నలకు 60 మార్కులు, జనరల్‌ ఇంగ్లిషులో 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్‌ నాలెడ్జిలో 20, జీకే, ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌లో 20, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌లో 20, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌లో 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉం టాయి. ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. అభ్యర్థులు ఇచ్చే ప్రాధాన్యాలను బట్టి సీట్‌ను కేటాయిస్తారు. 

మెథడాలజీ వారీగా సీట్ల విధానం 

  • మేథమెటిక్స్‌ వారికి 25 శాతం, ఫిజికల్‌ సైన్సెస్, బయోలాజికల్‌ సైన్సెస్‌ వారికి 30 శాతం సీట్లు (ఒక్కో దాంట్లో కనీసంగా 10 శాతం, గరిష్టంగా 20 శాతం), సోషల్‌ సైన్సె స్, ఇంగ్లిషు, ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ కలిపి 45 శాతం సీట్లు (ఇంగ్లిషులో కనీసం 5 శా తం, ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ వారికి కనీసం 5 శాతం ఉండాలి. ఈ 2 మెథడాలజీల్లో కలిపి 15 శాతానికి మించొద్దు) ఉంటాయి.  
  • ఇప్పటివరకు బీఎడ్‌ ఫిజికల్‌ సైన్స్‌ చేయాలంటే.. బీఎస్సీలో ఫిజిక్స్‌ అండ్‌ కెమిస్ట్రీ చదివి ఉండాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు దానిని మార్చారు. బీఎస్సీలో ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును (ఏదో ఒకటి) పార్ట్‌–2 గ్రూపులో చదివి ఉంటే సరిపోతుంది. బీటెక్‌లో ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టును, బీసీఏ విద్యార్థులు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉన్నా అర్హులే. 
  • బీఎడ్‌ బయోలాజికల్‌ సైన్స్‌ చదవాలంటే ఇప్పటివరకు డిగ్రీలో బోటనీ అండ్‌ జువాలజీ చదివి ఉండాలి. ఇకపై వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టును డిగ్రీలో పార్ట్‌–బీ గ్రూపులో చదివి ఉన్నా సరిపోతుంది. బీసీఏ విద్యార్థులు ఇంటర్‌లో బయోలాజికల్‌ సైన్సెన్‌ చదివి ఉండాలి. 
  • బీఎడ్‌ మేథమెటిక్స్‌ చేయాలంటే బీఏ/బీఎస్సీలో మ్యాథ్స్‌ గ్రూపు సబ్జెక్టుగా ఉంటే చాలు. బీఈ/బీటెక్‌లో మ్యాథ్స్‌ ఉన్నవారూ అర్హులే. బీసీఏ అభ్యర్థులు ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివి ఉంటే చాలు. 
  • బీఎడ్‌ సోషల్‌ సైన్సెస్‌ చేయాలంటే ఇప్పటివరకు బీఏలో సోషల్‌ సైన్సెస్‌కు సంబంధించిన రెండు సబ్జెక్టులను చదివి ఉండాలన్న రూల్‌ ఉంది. ఇప్పుడు బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్‌లో సోషల్‌ సైన్స్‌ చదివి ఉంటే సరిపోతుంది. 
  • బీఎడ్‌ ఇంగ్లిషు చేయాలనుకునే వారు బీఏలో స్పెషల్‌ ఇంగ్లిషు లేదా ఇంగ్లిష్‌ లిటరేచర్‌ లేదా ఎంఏ ఇంగ్లిషు చదివి ఉంటే చాలు. 
  • ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌లో బీఎడ్‌ చేయాలనుకుంటే.. బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్‌/సంస్కృతంను ఒక ఆప్షనల్‌గా చదివి ఉంటే సరిపోతుంది. లిటరేచర్‌ అభ్యర్థులు (బీఏ–ఎల్‌) తెలుగు/హిందీ/ మరాఠీ/ఉర్దూ/ అరబిక్‌/ సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్‌ లాంగ్వేజెస్‌ వారు తెలుగు/హిందీ/ మరాఠీ/ఉర్దూ/అరబిక్‌/ సంస్కృతం చేసి ఉండాలి. తెలుగు/హిందీ/ మరాఠీ/ఉర్దూ/ అరబిక్‌/సంస్కృతంలో పీజీ చేసిన వారు బీఎడ్‌ ఓరియెంటల్‌ లాంగ్వేజెస్‌ చేయొచ్చు.
మరిన్ని వార్తలు