హైదరాబాద్‌ నలువైపులా ఐటీ

6 Aug, 2020 08:27 IST|Sakshi

హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్‌..

పశ్చిమ ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐటీ పరిశ్రమల కారిడార్‌గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీని కేబినెట్‌ ఆమోదించింది.

ఉత్తరాన కొంపల్లి, పరిసర ప్రాంతాలు, తూర్పున ఉప్పల్, పోచారం, దక్షిణాన విమానాశ్రయం, శంషాబాద్, ఆదిభట్ల, వాయవ్యంలో(నార్త్‌వెస్ట్‌), కొల్లూరు, ఉస్మాన్‌నగర్‌తో పాటు పశ్చిమ కారిడార్‌ వెలుపలి ఇతర ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి ఈ పాలసీని ప్రభుత్వం తెచ్చింది. 2019–20లో హైదరాబాద్‌ 18 శాతం వృద్ధి రేటుతో రూ.1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, ఇందులో 90 శాతం పశ్చిమ కారిడార్‌ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి.  

ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. 
పారిశ్రామిక కేటగిరీ నుంచి ఐటీ పార్కు కేటగిరీకి భూ వినియోగ మార్పిడిని డెవలపర్లు ఎంపిక చేసుకోవచ్చు. డెవలపర్లకు 50:50 నిష్పత్తిలో వాటా లభించనుంది. పారిశ్రామిక కేటగిరీ నుంచి ఐటీ పార్కుగా భూ వినియోగ మార్పిడి చేయడానికి మొ త్తం స్థలంపై ఐడీఏలోని ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ విలువలో 30% చార్జీలు చెల్లించాలి.  

ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థలకు యూనిట్‌ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీని ఏడాదికి రూ.5 లక్షలకు మించకుండా చెల్లించనున్నారు.
 
ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థలకు లీజు అద్దెపై 30 శాతం సబ్సిడీని గరిష్టంగా ఏడాదికి రూ.10 లక్షలు దాటకుండా ఇవ్వనున్నారు.  

500 మంది కంటే ఎక్కువ మందికి ఉపాధినిచ్చే కంపెనీల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వనున్నారు. కాగా వచ్చే ఐదేళ్లలో సుమా రు 100 ఎకరాల పారిశ్రామిక పార్కులు ఐటీ పార్కులుగా మారుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఈ ఐదేళ్ల లో వచ్చే ఐటీ కంపెనీల ద్వారా లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది.

మరిన్ని వార్తలు