హైదరాబాద్‌ సీ‘రియల్‌’ స్నాచర్ల కేసులో కీలక మలుపు.. విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

17 Feb, 2023 09:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని రెండు కమిషనరేట్ల పరిధిలో వరుస స్నాచింగ్స్‌కు పాల్పడిన సీరియల్‌ స్నాచర్ల వ్యవహారంలో స్పష్టత వస్తోంది. నగరానికి వచ్చిన నలుగురు బవారియా గ్యాంగ్‌ సభ్యుల్లో ఇద్దరే నేరుగా నేరాలు చేసినట్లు తేలింది. ఏడు గొలుసు దొంగతనాలు, రెండు వాహన చోరీలు వీళ్లే చేయగా.. మిగిలిన ఇద్దరూ పథక రచనలోనే కీలకంగా వ్యవహరించినట్లు, వీరు కేవలం నాంపల్లి రైల్వేస్టేషన్‌ పరిసరాలకు పరిమితమయ్యారని వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు సీరియల్‌ స్నాచర్లలో ఒకడైన మంగళ్‌ను రాచకొండ పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఇతడిని కోర్టు అనుమతితో తొమ్మిది రోజుల పాటు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే పలు కీలకాంశాలు వెలుగుచూశాయి.  

రైలులో వచ్చి.. నాంపల్లిలో దిగి... 
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని ఉన్‌ మండలానికి చెందినదే ఈ బవారియా గ్యాంగ్‌. ఆ మండలంలోని పలు హామ్లెట్స్‌లో నివసించే పలు ముఠాలు దేశ వ్యాప్తంగా చైన్‌ స్నాచింగ్స్‌ సహా అనేక నేరాలు చేస్తుంటాయి. పంకజ్‌ అలియాస్‌ పింకు నేతృత్వంలో మంగళ్, దీపక్‌ అలియాస్‌ సెహ్వాగ్, సేవజ్‌ అలియాస్‌ లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్నారు. బెంగళూరులో వరుస స్నాచింగ్స్‌ చేసిన తర్వాత రైలులో గత నెల 7న నగరానికి వచ్చారు.

ఉదయం 4 గంటల ప్రాంతంలో రైలు దిగిన నలుగురూ కాసేపు స్టేషన్‌ పరిసరాల్లోనే సంచరించారు. ఆ తర్వాత పింకు, మంగళ్‌ ఆటో ఎక్కగా మిగిలిన ఇద్దరూ స్టేషన్‌ బయట ఉన్న కేఫ్‌ వద్ద ఆగిపోయారు. కేవలం కొన్ని గంటల్లోనే తమ ‘పని’ పూర్తి చేసుకునే ఈ గ్యాంగ్‌ ఫోన్లు వాడదు. తమ వారి నుంచి ఎక్కడ వేరయ్యారో, మళ్లీ అక్కడికే వచ్చి కలుస్తుంటారు. 

మాస్టర్‌ ‘కీ’ వినియోగించి మ్యాస్ట్రో.. 
నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఆటో మాట్లాడుకున్న పింకు, మంగళ్‌ నేరుగా చార్మినార్‌ వద్దకు వెళ్లారు. అక్కడ ఆటోడ్రైవర్‌కు రూ.200 ఇచ్చి పంపేశారు. స్నాచింగ్స్‌ చేయడానికి అనువైన వాహనాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి తస్కరించడానికి గాలించారు. మిట్టీకా షేర్‌ వద్ద కనిపించిన మ్యాస్ట్రో వాహనాన్ని తమ వద్ద ఉన్న మాస్టర్‌ ‘కీ’ వినియోగించి చోరీ చేశారు. దానిపై నాంపల్లి ప్రాంతానికి చేరుకునేసరికే స్నాచింగ్స్‌ చేయడానికి అనువైందని కాదని భావించారు.

అక్కడి శ్రీనివాస గ్రాండ్‌ హోటల్‌ వద్దకు అదే రోజు తెల్లవారుజామున 5.10 గంటలకు చేరుకున్న ఈ ద్వయం.. మ్యాస్ట్రో వాహనాన్ని వదిలి, అక్కడ ఉన్న పల్సర్‌ బైక్‌ను తస్కరించారు. దానిపైనే తిరుగుతూ ఉప్పల్, నాచారం సహా అయిదు పోలీసుస్టేషన్ల పరిధిలో ఏడు గొలుసు దొంగతనాలు చేసి 21 తులాల బంగారం అపహరించారు. 

తమ వారిని కలిసి తప్పుదారి పట్టిస్తూ.. 
రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో పల్సర్‌ వాహనాన్ని వదిలేసిన పింకు, మంగళ్‌ అక్కడ నుంచి ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్దకు వచ్చారు. కేఫ్‌ సమీపంలో ఉన్న సెహా్వగ్, లక్ష్మణ్‌లను కలిశారు. అక్కడ నుంచి నలుగురూ పోలీసులను తప్పుదారి పట్టించేలా వివిధ ప్రాంతాల్లో తిరిగి చివరకు వరంగల్‌ జిల్లా కాజీపేట నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ పారిపోయారు. చోరీ సొత్తు మొత్తం లక్ష్మణ్‌ తీసుకున్నాడని, అక్కడ నుంచి తాము స్వగ్రామాలకు వెళ్లిపోయారని మంగళ్‌ పోలీసుల వద్ద అంగీకరించాడు.

ఇతడిచ్చిన వివరాల ఆధారంగా రాచకొండ పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు సొత్తు రికవరీ చేయడానికీ సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క మంగళ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, విచారించడానికి మిగిలిన నాలుగు ఠాణాల అధికారులూ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు.  

మరిన్ని వార్తలు