ఖైరతాబాద్‌ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట

5 Sep, 2022 17:01 IST|Sakshi
ఖైరతాబాద్‌ గణేషుడి వద్ద రద్దీ.. మెట్రో స్టేషన్‌లో జనం బారులు

సాక్షి, హైదరాబాద్‌: గణపతి నవరాత్రోత్సవాల్లో ఐదవ రోజు... ఆదివారం కావడంతో నగరం ‘గణేష్‌ మహరాజ్‌ కీ జై’ నినాదాలతో మార్మోగింది. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల నిమజ్జనాలు.. మరికొన్నిచోట్ల ప్రత్యేక పూజలు, లడ్డూల వేలం పాటలతో కోలాహలం నెలకొంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భారీ క్యూలైన్లు కన్పించాయి. 


ఖైరతాబాద్‌కు తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. మింట్‌ కాంపౌండ్, ఖైరతాబాద్‌ చౌరస్తా, లక్డీకాపూల్, టెలిఫోన్‌ భవన్‌ రోడ్లపై ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ ప్రాంతానికి వచ్చే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు సైతం జనంతో కిటకిటలాడాయి. 


నగరం నలు మూలల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆదివారం ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ కిటకిటలాడింది. ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు అత్యంత రద్దీగా కనిపించాయి. ఖైరతాబాద్‌ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, మెట్రో సిబ్బంది అవస్థలు పడ్డారు. ఆదివారం మూడు మెట్రో మార్గాల్లో రద్దీ నాలుగు లక్షల మార్కు దాటిందని మెట్రో అధికారులు తెలిపారు. (క్లిక్‌: కౌంటర్‌ టికెట్లకూ ఆన్‌లైన్‌ రద్దు సదుపాయం)

మరిన్ని వార్తలు