Snehalata Mogili: ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్‌ ప్రసవం

25 Oct, 2021 09:02 IST|Sakshi

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభినందన

సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న అదనపు కలెక్టర్‌ స్నేహలత, ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌లను రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభినందించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి.. స్నేహలతకు జన్మించిన చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. భార్యాభర్తలిద్దరూ ఉన్నతాధికారులైనా.. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. 
చదవండి: కాళ్లు కడిగి.. కన్యాదానం చేసి.. ఆదర్శంగా నిలిచిన ముస్లిం దంపతులు


చిన్నారిని ఎత్తుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌. చిత్రంలో స్నేహలత, ఆమె భర్త శబరీశ్‌ తదితరులు

కాగా  ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత , భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్​పీ శబరీస్​ దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. స్నేహలత సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. డెలివరీ టైం అని వైద్య సిబ్బంది కలెక్టర్ స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. తల్లిబిడ్డా క్షేమమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ కలెక్టరమ్మ డెలివరీ న్యూస్ నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడుపోసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ స్నేహలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.
చదవండి: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’

మరిన్ని వార్తలు