బడేసాహెబ్‌ బతికే ఉన్నాడు.. ‘చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది’

26 Jan, 2022 17:42 IST|Sakshi

సాక్షి, చండ్రుగొండ(ఖమ్మం): ఓ మనిషి బతికుండగానే మరణించాడంటూ రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు అతడికి వచ్చే ఆసరా పింఛను నిలిపేశారు. దీంతో ఏడు నెలలుగా పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన ఎస్‌కే బడేసాహెబ్‌కు సుమారు 15 ఏళ్లుగా వృద్ధాప్య పింఛను వస్తోంది. ఏడు నెలల క్రితం పింఛను డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో జమ కాలేదని బ్యాంకు అధికారులు చెప్పారు.

అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అడిగితే ‘నీవు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది’అని సమాధానం చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పింఛను మాత్రం పునరుద్ధరించలేదు. వృద్ధాప్యంతో ఏ పనీ చేయలేనని, పూట గడవడమే కష్టంగా ఉందని, కనీసం మందులు కొనే పరిస్థితి కూడా లేదని బడేసాహెబ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పింఛన్‌ వచ్చేలా చూడాలని వేడుకుంటున్నాడు. దీనిపై ఎంపీడీఓ అన్నపూర్ణను వివరణ కోరగా గ్రామ కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకే బడేసాహెబ్‌ పింఛను రద్దు చేసినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు