పొలం గట్టుపై నుంచి మంత్రితో మాట్లాడిన సీఎల్పీ

20 May, 2021 14:46 IST|Sakshi

రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

తరుగు తీయవద్దని మంత్రికి చెప్పిన భట్టి

సాక్షి, ఖమ్మం: కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ధాన్యాన్ని కాంటాలు వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని కోరారు. చింతకాని మండలం తిమ్మినేని పాలెం పొలం గట్టు మీద నుంచి వ్యవసాయశాఖామంత్రి నిరంజన్ రెడ్డితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కొన్ని రోజుల తరబడి వడ్లు కొనకుండా, మిల్లులు అలాట్ కాకుండా, లారీలు రాకుండా గత కొన్ని రోజులుగా పొలంలో తడుస్తున్న ధాన్యం గురించి వ్యవసాయ శాఖామంత్రికి చెప్పి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.. అలాగే తరుగు కూడా 6 కిలోల నుంచి 8 కిలోల వరకూ తీస్తున్నారని, అంత మొత్తంలో తరగు తీయకుండా చూడాలని మంత్రికి చెప్పారు.

గత కొన్ని రోజులుగా ఎర్రుపాళెం, మధిర, చింతకాని, బోనకల్, ముదిగొండ తదితర మండలాల్లోని పొలాల్లో ఉన్న ధాన్యాన్ని చూసి, సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. జిల్లా అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని సీఎల్పీనేతకు హామీ ఇచ్చారు. అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల గురించి పలు మండలాల్లో సీఎల్పీ నేత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చింతకాని మండలంలోని తిమ్మినేని పాళెం, తిరుమలాయపాళెం, జగన్నాథపురం, పందిళ్ల పళ్లి, రామక్రిష్ణాపురం వంటి పలు గ్రామాల్లో ఈ రోజు ఆయన పర్యటించారు.

ఈ మేరకు పీపీఎస్ఈ కొ-ఆపరేటివ్ సొసైటీ కింద నాగులవంచ కొనుగోలు కేంద్రానికి మిల్లును అలాట్ చేయలేదని రైతులు తమ గోడును సీఎల్పీ నేత వద్ద వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొప్పుల గోవింద రావు, పందిళ్లపల్లి ఎంపీటీసీ వీరభద్రం, సొసైటీ డైరెక్టర్లు తూము కోటేశ్వర రావు, రామారావు, మండల కాంగ్రెస్ నాయకులు బసవయ్య, కోరపాటి రాము తదితరుల పాల్గొన్నారు.

చదవండి: వైరల్‌: కానిస్టేబుల్‌ మానవత్వం.. సలామ్‌ కొడుతున్న నెటిజన్లు

మరిన్ని వార్తలు