Khammam: చికెన్‌ మాత్రమే తినే కోడి!

25 Aug, 2021 19:09 IST|Sakshi

భలే కోడి గురూ... 

కూసుమంచి: ఈ చిత్రంలోని కోడి పేరు మోటూ! అది దాణా బదులు చికెన్‌ తింటోంది. యజమాని చెప్పినట్లు వింటోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని తెలంగాణ చికెన్‌ సెంటర్‌ యజమాని ఇలియాస్‌ ఆ కోడిని పెంచుతున్నాడు. బ్రాయిలర్‌ కోళ్లను దిగుమతి చేసుకుని చికెన్‌ విక్రయించే ఇలియాస్‌కు గత నెలలో వచ్చిన ఈ కోడి నచ్చింది.

దానికి మోటూ అని ముద్దు పేరు పెట్టి దాణా బదులు చికెన్‌ ముక్కలు, స్కిన్‌ అలవాటు చేశాడు. దీంతో అది చికెన్‌ తప్ప దాణా ముట్టుకోవడం లేదు. ఆ కోడిని యజమాని ‘మోటూ ఇదర్‌ ఆవో’అని పిలిస్తే చాలు వచ్చేస్తోంది. యజమాని వెంటే తిరుగుతూ... ఆయన సైగలకు అనుగుణంగా నడుచుకుంటోంది. కాగా, ఈ కోడిని కొందరు రూ.5వేల వరకు అడిగినా ఇవ్వలేదని ఇలియాస్‌ తెలిపారు. 

కాలువలో 5 కి.మీ. కొట్టుకుపోయిన గేదెలు 
నేలకొండపల్లి: ప్రమాదవశాత్తూ నాలుగు పాడి గేదెలు కాలువలో పడ్డాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 5 కిలో మీటర్ల మేర కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అమ్మగూడెంనకు చెందిన రైతు అడపాల రమేశ్‌కు నాలుగు గేదెలు ఉన్నాయి. మంగళవారం వాటిని మేతకు తీసుకెళ్తుండగా నందిగామ బ్రాంచ్‌ కాలువలో గేదెలు జారి పడ్డాయి.

అయితే గేదెలు పైకి ఎక్కడానికి ఎక్కడా మార్గం లేకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర కొట్టుకుపోతూ నేలకొండపల్లికి చేరాయి. అప్పటికే అమ్మగూడెంనకు చెందిన పలువురు రైతులు కాలువ కట్ట వెంట పరుగెత్తుతూ గేదెలను బయటకు లాగేందుకు శ్రమించారు. చివరకు నేలకొండపల్లి బ్రిడ్జి సమీపంలో రైతులంతా కాలువలోకి దూకి వాటిని అడ్డుకుని తాళ్లుకట్టి పైకి లాగారు.

చదవండి: బాబోయ్‌ బార్‌.. భయపడుతున్న యజమానులు 

మరిన్ని వార్తలు