ఖమ్మం: ఇక వానర గణనకు ప్రత్యేక యాప్‌..

16 Dec, 2021 14:14 IST|Sakshi

వైరా: గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వాటి లెక్కను అంచనా వేసేందుకు సర్వే చేపడుతున్నారు. ఇళ్ల వద్ద కూరగాయల పాదులు ఆగం చేస్తూ, వస్తువులు చిందరవందరగా పడేస్తూ, చేల వద్ద పంటలకు నష్టం కలిగిస్తుండడంతో తీవ్రతను గుర్తించబోతున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు చేపట్టారు. వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈఓ)లు పల్లెల్లో తిరుగుతూ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఏ మేరకు పంటలు ధ్వంసం చేశాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి ? చెట్లు, ఇళ్లు, గుట్టలు, పర్యాటక ప్రాంతం? రోడ్డు వెంట?..ఇలా ఎక్కడ నివసిస్తున్నాయనే అంశాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. రైతులతో మాట్లాడిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌ క్రాప్‌ బుకింగ్‌ మాడ్యూల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వానరాలను భయపెట్టేందుకు ప్రజలు నైలాన్‌ వలలు, సోలార్‌ ఫెన్సింగ్, మంకీ గన్, కొండ ముచ్చులు, బొమ్మలు, పులి అరుపు తదితర శబ్ద పరికరాలు వినియోగిస్తున్నారా? అనే వివరాలు కూడా యాప్‌లో పొందుపర్చాలి. 

కూరగాయల పంట మిగలట్లే..
జిల్లాలోని 21 మండలాల్లో సూమారు మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, కంది, మొక్కజొన్న, పత్తి, చెరకు, పామాయిల్, పెసరతో పాటు కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, కొణిజర్ల, చింతకాని ఈ మండలాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో గ్రామాల్లోకి కోతులు గుంపులుగా వస్తున్నాయి. వంగ, బీర, కాకర, సొర, టమాటా, తదితర కూరగాయాల పంటలను ఆగం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు తెంపేస్తూ, సగం తిని సగం పడేస్తూ, మొక్కలను, తీగలను పీకేస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేల వద్ద కాపలా లేకుంటే దిగుబడి చేతికందే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. 

ఇళ్ల వద్ద ఆగమే..
వ్యవసాయ క్షేత్రాలే కాదు..ఇళ్ల వద్దకూ కోతులు గుంపులుగా వస్తున్నాయి. ఆరుబయట ఉన్న వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. దుకాణాల్లోని తినుబండారాలను ఎత్తుకెళుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి దూరి బియ్యం, పప్పులు, అన్నం, ఇతర పదార్థాలను బుక్కుతున్నాయి. అడ్డుకోబోతే మీదికొస్తూ దాడిచేస్తున్నాయి. ఇంటి పైకప్పులు, చెట్లపై ఉంటూ కొన్నిచోట్ల పిల్లలు, పెద్దలను పరిగెత్తిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు జంకుతున్నారు. చాలామందిని కరిచిన సందర్భాలు ఉన్నాయి. 

వారంలోగా పూర్తిచేస్తాం..
గ్రామాల్లో ఎన్ని కోతులు ఉన్నాయనే అంశంపై సర్వే చేయాలని ఆదేశించాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తాం. ఏఈఓలు స్వయంగా పల్లెల్లో తిరిగి కోతుల నష్ట తీవ్రతను చూసి, వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. రైతులు సహకరిస్తే పక్కా సమాచారం లభిస్తుందని భావిస్తున్నాం. 
– బాబూరావు, ఏడీఏ, వైరా

చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక

మరిన్ని వార్తలు