ఎంతో చూశా.. చేశా

29 Aug, 2020 13:09 IST|Sakshi
కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్

సాక్షి, ఖమ్మం: చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఈ కాలం మధురానుభూతిని, అనుభవాన్ని మిగిల్చిందని, జిల్లా ప్రజలు సౌమ్యులే కాకుండా మంచి అవగాహన కలిగిన వారని, అందువల్లే జిల్లాలో తన హయాంలో జరిగిన అన్ని రకాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామినయ్యానని పూర్తి సంతృప్తి ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి ఈనెల 30వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ‘సాక్షి ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా..

వరుస ఎన్నికల నిర్వహణతో ఇబ్బంది పడ్డారా? 
కలెక్టర్‌గా 2018, ఆగస్టు 30వ తేదీన నేను బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది. తర్వాత వరుసగా లోక్‌సభ, మున్సిపాలిటీ, సహకార సంఘాల ఎన్నికలను సైతం ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఎలక్షన్లు నాకు మంచి అనుభవాన్ని ఇవ్వడంతోపాటు జిల్లా ప్రజలకు చేరువ కావడానికి ఉపయోగపడ్డాయి. చైతన్యవంతమైన రాజకీయ జిల్లాగా పేరొందిన ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలతోపాటు ప్రజలు పూర్తి సహకారం అందించారు. అందుకే..ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిచేయగలిగాం.

ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనపై మీ కృషి ఏ మేరకు ఫలించింది?
కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా చేసిన ప్రయత్నం జిల్లాలో మంచి ఫలితాలను ఇచ్చింది. నమోదు గణనీయంగా పెరిగింది. రెండు సంవత్సరాల నా పదవీ కాలంలో అనేక ఎన్నికలు నిర్వహించా. ఓటర్ల జాబితాపై దృష్టి సారించి..వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్ల పేర్లను తొలగించి..ఒకేచోట ఓటు హక్కు ఉండేలా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పూర్తి చేశాం. 

కొత్త పరిశ్రమలు రానున్నాయా..?
జిల్లాలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. సుబాబుల్, జామాయిల్‌ పండించే రైతులు ఇప్పుడు ఆయిల్‌పామ్‌పై దృష్టి సారించడంతో ఫ్యాక్టరీ ఆవశ్యకత పెరిగింది. అనేక ప్రైవేట్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం ఉంది. 

పంటల నిల్వ చర్యలేంటి?
జిల్లాలో పండించే పంటలను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే కోవిడ్‌ కారణంగా మిర్చి పంట ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేక కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. వచ్చే రెండు నెలల్లో స్థానిక మార్కెట్‌లోనే మిర్చికి మంచి ధర లభిస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పండిన పంటలకు నిల్వ చేసే కోల్డ్‌ స్టోరేజీలు దాదాపు సరిపోయే అవకాశం ఉంది. 

భూ ప్రక్షాళన ఏ విధంగా కొనసాగుతోంది?
దాదాపు పూర్తయింది. ప్రభుత్వం రైతులకు రైతుబంధు అందజేస్తోంది. వివిధ కారణాల వల్ల ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారంపై దృష్టి సారించాం.

నియంత్రిత సాగు గురించి..?
మంచి ఫలితాలను ఇస్తోంది. గత సంవత్సరం 90వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు.. ఈసారి 900 ఎకరాలకే పరిమితవడం ఓ మంచి ఉదాహరణ. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను వేయాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు జిల్లా రైతులు స్పందించిన తీరు ప్రశంసనీయం. 

‘మిషన్‌ నారి’పై దృష్టి సారించారు కదా..?
జిల్లాలో 19 సంవత్సరాలలోపు వయసు కలిగిన బాలికలకు మిషన్‌ నారి పథకం కింద వైద్య ఆరోగ్య శాఖలోని మహిళా సిబ్బందితో జిల్లా అంతటా పరీక్షలు నిర్వహించాం. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి ప్రత్యేకంగా వైద్య సౌకర్యం కల్పించాం. ఆరోగ్యపరమైన ఇతర సమస్యలను గుర్తించి వారికి ఎప్పటికప్పుడు చికిత్స అందించాం.

జిల్లా అభివృద్ధిలో మీ ప్రాధాన్యాలేంటి..?
పూర్తి వ్యవసాయాధారిత జిల్లా. ఆలు, సోయాబీన్‌ మినహా అన్ని రకాల పంటలు పండించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారు. వారి నైపుణ్యానికి మరింత మెరుగులు దిద్దడానికి జిల్లా కలెక్టర్‌గా తొలి ప్రాధాన్యం వ్యవసాయ రంగానికి, మలి ప్రాధాన్యం వైద్య ఆరోగ్య రంగానికి ఇచ్చి ప్రధానంగా దృష్టి సారించా. దీంతో రైతులకు అనేక ప్రయోజనకరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం లభించింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగు పరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పడకలు నేను రావడానికి ముందు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 520కు పెంచాం. 220 పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం, 50 పడకలకు వెంటిలేటర్‌ సౌకర్యం కల్పించాం. ప్రభుత్వ ఆస్పత్రులపై జిల్లా ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలు అందించడంతో ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

రెండు అవార్డులతో ప్రోత్సాహం
శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించాం. ప్రతి నియోజకవర్గంలోనూ గతం కంటే పోలింగ్‌శాతం పెరగడాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ అవార్డు ప్రకటించడం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ ఎన్నికలను పకడ్బందీగా,  ప్రశాంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సైతం అవార్డు అందించింది. 

మరిన్ని వార్తలు