పోడు సర్వేకు బ్రేక్‌.. విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది

25 Nov, 2022 04:03 IST|Sakshi
ఖమ్మంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు, సెక్షన్, బీట్‌ ఆఫీసర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది

ఆయుధాలు ఇవ్వాలని, ఫారెస్ట్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌

ఉద్యోగుల ఆందోళనలతో నిలిచిపోయిన గ్రామసభలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం:  పోడు సర్వేకు బ్రేక్‌ పడింది. ఎఫ్‌ఆర్‌ఓ చలమల శ్రీనివాసరావు హత్యను నిరసి స్తూ అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాఖ సిబ్బంది గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేయడంతో పాటు డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే గాందీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇక శుక్రవారం నుంచి డివిజన్, జిల్లా స్థాయిలో ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.

తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్‌ రేంజర్స్‌ అసోసియేషన్, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమ కు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్‌ స్టేష న్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని నినదించారు. అలాగే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ యాక్ట్‌ను బహిర్గతం చేయాల న్నారు. ఇక ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన దర్యాప్తును పారదర్శకంగా చేయా లని డిమాండ్‌ చేశారు. నిందితులను తామే పట్టు కుని పోలీసులకు అప్పగించినట్లు ఉద్యోగులు తెలిపారు. 

దరఖాస్తులపై గందరగోళం.. 
పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. దర ఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోడు సర్వే చివరి దశకు చేరిందని ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది చెబుతున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతలోనే ఎఫ్‌ఆర్‌ఓ హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి. పోడు సర్వేలో అటవీ సిబ్బంది కీలకం కాగా.. వీరు లేకుండా రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వేకు వెళ్లే అవకాశాలు లేవు.

ఇదీ చదవండి: Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి

మరిన్ని వార్తలు