Khammam: తొలి తరం కమ్యూనిస్టు నేత భూపతిరావు మృతి

6 Sep, 2022 11:13 IST|Sakshi

సాక్షి, భద్రాచలం/ఖమ్మం: తొలి తరం కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే, భద్రాచలానికి చెందిన భీమపాక భూపతిరావు(91) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో కూడిన అనారోగ్యంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందిన ఆయనను ఇటీవల భద్రాచలం తీసుకొచ్చారు. కాగా, సోమవారం తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెందారు. భీమపాక నాగయ్య, పుల్లమ్మ కుమారుడైన భూపతిరావు.. రావి నారాయణరెడ్డి, దొడ్డా నర్సయ్య ఉపన్యాసాలకు ఆకర్షితులై తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.

పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, రజాకార్లకు వ్యతిరేకంగా నాడు మధిర, డోర్నకల్‌ రైల్వే స్టేషన్లలో పట్టాలు తొలగించిన ఘటనల్లో ఆయన పాల్గొన్నారు. భద్రాచలం ఏజెన్సీలో బంజరు భూములు, ప్రభుత్వ భూములను పేదలకు ఇప్పించడంలో భూపతిరావు కీలకపాత్ర పోషించారు. అందుకు కృతజ్ఞతగా ప్రజలు ఆ కాలనీకి ఆయన పేరు పెట్టుకున్నారు.
చదవండి: Hyderabad: రాజాసింగ్‌ అరెస్ట్‌.. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే భార్య

1983లో పాలేరు ఎమ్మెల్యేగా విజయం..
1950లో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సీపీఐ సభ్యత్వం తీసుకుని డివిజన్‌ మొదలు రాష్ట్ర స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా సీపీఐ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా జీవితం గడిపిన ఆయన ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పార్టీకి ఇచ్చేశారు. పార్టీ ఇచ్చే వేతనంతో జీవితాన్ని సాగించారు. భూపతిరావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భూపతిరావు కుమారుడు నగేష్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ఎంపికయ్యారు.   

మరిన్ని వార్తలు