రైలు ప్రయాణం.. యూటీఎస్‌ యాప్‌లో జనరల్‌ టికెట్ల బుకింగ్ ఇలా!

25 May, 2022 21:25 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : రైలు ప్రయాణమంటే హడావుడి అంతాఇంత కాదు. ఇంటి నుంచి స్టేషన్‌కు పిల్లలు, లగేజీతో చేరుకోవడం.. తీరా టికెట్‌ కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూలో నిల్చొని టికెట్‌ తీసుకోవడం.. ఇంతలోనే ఎక్కాల్సిన రైలు ఒక్కోసారి వెళ్లిపోవడం.. టికెట్‌ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టాల్సి రావడం.. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్‌ పెట్టేలా రైల్వే శాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరి చేతుల్లో ఇంటర్నెట్‌ సౌకర్యంతో కూడిన స్మార్ట్‌ పోన్లు ఉంటున్న నేపథ్యంలో ఎంచక్కా ఇంటి నుంచే జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని సమయానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లే అవకాశం కల్పించారు. యూటీఎస్‌(అన్‌ రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం) మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, జిల్లాలోని అన్ని రైల్వేస్టేషన్లలో యాప్‌ ఉపయోగించుకునేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. 

ఇవీ నిబంధనలు..
ప్రధాన రైల్వేస్టేషనల్లో పండుగ సెలవులు, వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇబ్బంది పడకుండా యాప్‌ ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాగా, ప్రయాణికులు రైలు ప్రయాణం చేసే రోజునే ఈ యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ బుక్‌ అయిన గంటలోపే రైలు ఎక్కాల్సి ఉండగా, ఎక్కాల్సిన రైల్వేస్టేషన్‌ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రైలు ఉన్నప్పుడే యూటీఎస్‌ ద్వారా టికెట్‌ బుక్‌ అవుతుంది. అలాకాకుండా రైలు ఎక్కాక టికెట్‌ బుక్‌ కాదు. అలాగే, స్మార్ట్‌ ఫోన్‌లో జీపీఆర్‌ఎస్‌ యాక్టివేషన్‌లో ఉండాలి. 
చదవండి: చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు..

యాప్‌లో నమోదు, బుకింగ్‌ ఇలా..
జీపీఆర్‌ఎస్‌ యాక్టివేషన్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉన్నవారు గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యూటీఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లేదంటే www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. యాప్‌ ఓపెన్‌ చేశాక ఫోన్‌ నంబర్, పేరు, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసుకుని వచ్చే ఓటీపీ ఆధారంగా ఖాతా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆతర్వాత యాప్‌ తెరిచి ఫోన్‌ నంబరు, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్‌ అయితే సాధారణ బుకింగ్, క్విక్‌ బుకింగ్, ఫ్లాట్‌ఫాం టికెట్, సీజన్‌ టికెట్, క్యూఆర్‌ బుకింగ్, కేన్సల్‌ టికెట్‌ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి.

ఇందులో ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం తదితర వివరాలు నమోదు చేసి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇక నగదు చెల్లింపునకు ఆర్‌–వ్యాలెట్, క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ పేమెంట్‌ ఉపయోగించుకోవచ్చు. కాగిత రహిత టికెట్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే టికెట్‌ కలెక్టర్లకు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న టికెట్‌ చూపిస్తే సరిపోతుంది. లేదా ముద్రించిన టికెట్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే రైల్వేస్టేషన్‌లోని ఏటీవీఎం, కో–టీవీఎం, ఓసీఆర్‌ యంత్రాలు, ఓటీఎస్‌ బుకింగ్‌ కౌంటర్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు.

ఖమ్మం స్టేషన్‌లో అవగాహన..
ఖమ్మం మామిళ్లగూడెం: యూటీఎస్‌(అన్‌ రిజర్వుడ్‌ టికెట్‌ సిస్టమ్‌)పై రైల్వే అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లకు జనరల్‌ టికెట్లతో పాటు సీజన్‌ టికెట్లు, పాస్‌ తీసుకునే అవకాశముందని వెల్లడించారు. ఇందుకోసం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో మంగళవారం అవగాహన కల్పించిన అధికారులు సాధారణ బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటుచేయడమే కాక స్టేషన్‌ పరిసరాల్లో కూ ఆర్‌ కోడ్‌ స్కానర్లు అమర్చారు. చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసన్నకుమార్, చీఫ్‌ బుకింగ్‌ సూపర్‌వైజర్‌ జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు