బర్త్‌ కంపానియన్‌.. భర్త సమక్షంలో పురుడు

31 Jan, 2022 04:15 IST|Sakshi

తొలిసారిగా ఖమ్మం పెద్దాస్పత్రిలో కొత్త విధానంలో కాన్పు

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం పెద్దాస్పత్రిలో ఓ గర్భిణీకి భర్త సమక్షంలో ‘బర్త్‌ కంపానియన్‌’విధానంలో కాన్పు చేశారు వైద్యులు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో హెచ్‌వోడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి, గాయత్రి, స్టాఫ్‌నర్స్‌ అరుణ నూతన విధానంలో శ్రీలత(23) అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ సమయంలో ఆమె భర్తను లేబర్‌రూం లోనికి పిలిపించారు.

ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో గర్భిణీలో భయం, ఒత్తిడి, ఆందోళన ఉంటుందని, ఆ కారణంగా నొప్పులు రావడానికి అవసరమైన ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదల కాదని వైద్యసిబ్బంది తెలిపారు. అందుకే భర్తగానీ, మనసుకు దగ్గరైనవారుగానీ ఆమె చెయ్యి పట్టుకోవడం, తల నిమరడం వంటివి చేయడం ద్వారా ఆక్సిటోసిన్‌ త్వరగా విడుదలై నొప్పులు ఎక్కువగా వచ్చి త్వరగా సుఖప్రసవం అవుతుందని వివరించారు.

ఈ విధానంలో శిశువు బొడ్డుతాడును తండ్రితో కత్తిరించడం ద్వారా అతడు గొప్ప అనుభూతిని పొందడమే కాకుండా భార్య ప్రసవవేదనను దగ్గరుండి చూస్తే, ఆమెపై మరింత గౌరవం పెరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాన్పుగదిలోకి గర్భిణులు తమ భర్త, అమ్మ, అత్త, చెల్లి.. ఇలా ఇష్టమైనవారిలో ఒకరిని అనుమతిస్తామని చెబుతున్నారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉండగా, మనదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఆచరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు