Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్నపై మంత్రి పువ్వాడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. ఏడు రోజుల్లో! 

18 May, 2022 08:12 IST|Sakshi

రూ.10 కోట్లకు దాఖలు చేసిన మంత్రి పువ్వాడ

సాక్షి, ఖమ్మం లీగల్‌: ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదులు పేరి వెంకటరమణ, పేరి ప్రభాకర్‌ ద్వారా ఆయన మల్లన్నకు నోటీసులు పంపించారు. ప్రజాసేవలో ఉన్న తమ క్లయింట్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రచారం పొందాలనే దురుద్దేశంతో తీన్మార్‌ మల్లన్న తన చానల్, పత్రికలో అబద్ధాలు ప్రసారం చేశారని నోటీసులో పేర్కొన్నారు.

బీజేపీకి చెందిన మల్లన్న జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని తెలిపారు. ఈమేరకు సివిల్, క్రిమినల్‌ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని, దీంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు బాధ్యులవుతారని పేర్కొన్నారు. కాగా, ఏడు రోజుల్లోగా తన క్లయింట్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు నోటీసులో సూచించారు.  
చదవండి: VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా

మరిన్ని వార్తలు