ఖమ్మం పోస్టల్‌ బ్యాంక్‌కి జాతీయ స్థాయి గుర్తింపు

19 Sep, 2020 11:18 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ జాతీయస్థాయిలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఆధార్‌ ఆధారిత విధానంలో ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ జాతీయస్థాయిలో నంబర్‌వన్‌గా నిలిచినట్లు శుక్రవారం ఢిల్లీ జాతీయ పోస్టల్‌ విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ యలమందయ్యకు ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు అందాయి. జాతీయ స్థాయిలో పోస్టల్‌ శాఖ 2018 సెప్టెంబర్‌ నుంచి ఐపీపీబీ బ్రాంచ్‌లతో నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్‌ నిర్వహణలో మంచి ఫలితాలను సాధిస్తుండటంతో 2019 సెప్టెంబర్‌ నుంచి ఆధార్‌ ఆధారిత విధానాన్ని (ఏఈపీఎస్‌) అమలులోకి తీసుకువచ్చింది.

ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నప్పటికీ ఆధార్‌ కార్డు ఆధారంగా ఐపీపీబీ ద్వారా నగదును డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఐపీపీబీ దేశం మొత్తంలో ఆగస్టు 31వ తేదీ నాటికి రూ.6 వేల కోట్ల నగదును పంపిణీ చేసింది. ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ (పూర్వపు ఖమ్మం జిల్లా) పరిధిలోని 611 పోస్టల్‌ బ్రాంచ్‌ల్లో ఐపీపీబీని నిర్వహిస్తోంది. ఆధార్‌ ఆధారిత విధానం ప్రారంభమైనప్పటి నుంచి 2020 ఆగస్టు 31వ తేదీ వరకు రూ.106.15 కోట్లను 2,76,288 లావాదేవీల్లో నిర్వహించింది. ఈ లావాదేవీల నిర్వహణలో ఖమ్మం డివిజన్‌ ఐపీపీబీ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఐపీపీబీ రెండేళ్లు నిండిన క్రమంలో ఢిల్లీ పోస్టల్‌ కార్పొరేట్‌.. ఆధార్‌ ఆధారిత విధానం అమలులో ఖమ్మం డివిజన్‌ ఐపీపీబీ నంబర్‌వన్‌గా నిలిచిందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మూడు సర్కిళ్లను టాప్‌ ర్యాంకర్లుగా గుర్తించింది. ఈ ర్యాంకుల్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

ఈ సర్కిళ్లలో నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించిన బ్రాంచ్‌గా ఖమ్మం గాంధీచౌక్‌ బ్రాంచ్‌ (ఖమ్మం ఐపీపీబీ) నిలిచింది. 2వ ర్యాంక్‌ హూజూర్‌నగర్‌ బ్రాంచ్‌కి దక్కింది. మూడో ర్యాంక్‌ నారాయణరావుపేట బ్రాంచ్, 5వ ర్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప బ్రాంచ్‌ దక్కించుకుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో బ్యాంకుల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో ప్రజలు ఐపీపీబీ సేవలను బాగా వినియోగించుకున్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.500 చొప్పున జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రేషన్‌ కోసం రూ.1500 చొప్పున పేద వర్గాల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశాయి. ఈ మొత్తాలను ఆధార్‌ ఆధారిత విధానంలో ఖమ్మం ఐపీపీబీ ప్రజలకు అందజేసింది. ఈ క్రమంలో ఐపీపీబీ లావాదేవీలు బాగా పెరిగాయి. ఖమ్మం డివిజన్‌ ఐపీపీబీ సేవలను జిల్లాలో ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించడంతో దేశ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఆరు నెలల కిందట ఖమ్మం ఐపీపీబీ పరిధిలోని సత్తుపల్లి డివిజన్‌ అన్నపురెడ్డిపల్లి బ్రాంచ్‌ పెద్దిరెడ్డిగూడెం సబ్‌ పోస్టాఫీస నిర్వాహకుడు కదూరు శ్రీనివాస్‌ బ్యాంక్‌ ఖాతాలను చేర్చడంలో దేశంలో 9వ స్థానాన్ని దిక్కంచుకున్నారు. ఆయనను ఢిల్లీ కార్పొరేట్‌ పోస్టల్‌ శాఖ సత్కరించింది. 

అంకితభావంతో పనిచేశాం 
ఖమ్మం ఐపీపీబీ పరిధిలో ఉన్న పోస్టల్‌ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయటం కారణంగానే దేశంలోనే ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌కు గుర్తింపు వచ్చింది. ఖమ్మం ఐపీపీబీ ఆది నుంచి క్రమశిక్షణతో, లక్ష్యంతో పనిచేస్తోంది. ఖమ్మం ఐపీపీబీ జాతీయస్థాయిలో నంబర్‌వన్‌గా నిలపడంలో ఉద్యోగులందరి కృషి ఉంది. ఐపీపీబీ నిర్వాహకులు, ఉద్యోగులను అభినందిస్తున్నా. - యలమందయ్య, ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌

అందరి కృషి ఫలితమే..
ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న ఉద్యోగుల కృషి ఫలితంగానే జాతీయ స్థాయిలో ఆధార్‌ ఆధారిత విధానం అమలులో నంబర్‌వన్‌గా నిలిచాం. కరోనా వంటి కష్ట కాలంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయని సమయంలో పోస్టల్‌ ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వాల నుంచి అందిన సహాయాన్ని అందజేశారు. ఖమ్మం ఐపీపీబీకి ఈ స్థాయి గుర్తింపు మరవలేనిది. 
-అనిల్, ఖమ్మం ఐపీపీబీ మేనేజర్‌

మరిన్ని వార్తలు