విషాదం: వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డల మృతి?

3 Jun, 2021 08:47 IST|Sakshi

వైద్యుల నిర్లక్ష్యమేనని మృతురాలి తండ్రి ఆరోపణ

సాక్షి, భద్రాచలం: ఏపీ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా యటపాక మండలం చెన్నంపేట గ్రామానికి చెందిన పూనెం సమ్మక్క(25) ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది. దుమ్ముగూడెంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. మృతురాలి తండ్రి దుమ్ముగూడెం మండలం రేగుంట గ్రామస్తుడు పాయం ఎర్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూనెం సమ్మక్కను ప్రసవం కోసం మంగళవారం దుమ్ముగూడెం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యాధికారి ప్రసవం చేయగా బాబు జన్మించాడు. అనంతరం తల్లికి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తరలించే క్రమంలో తల్లి, బాబులు ఇద్దరు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీ బిడ్డ చనిపోయారని, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎర్రయ్య డిమాండ్‌ చేశారు.

దీనిపై దుమ్ముగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ బాలాజీ నాయక్‌ను వివరణ కోరగా.. పూనెం సమ్మక్కను ప్రసవం కోసం మంగళవారం ఉదయం పీహెచ్‌సీకి తీసుకురాగా పరీక్షించి గర్భాశయంలో బిడ్డ ఎదురుకాళ్లతో ఉండటంతో సాధారణ ప్రసవం కష్టమని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. మళ్లీ సాయంత్రం తీసుకురాగా.. భద్రాచలం ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించామని పేర్కొన్నారు. కాన్పుకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉందని ఏరియా ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో ఇంటికి వచ్చామని, ఇంటికి వచ్చాక నొప్పులు రావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చినట్లు మృతురాలి కుటుంబీకులు తెలిపారని డాక్టర్‌ వివరించారు. మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చేసరికే బిడ్డ రెండు కాళ్లు బయటికి వచ్చిన క్రమంలో తప్పనిసరి పరిస్థితులలో అత్యవసరంగా ప్రసవం చేశామని, రక్తస్రావం అవుతుంటే 108 ద్వారా స్టాఫ్‌నర్స్‌ను తోడుగా పంపామని పేర్కొన్నారు. ముందుగానే గర్భిణి తండ్రి, కుటుంబీలకు పరిస్థితిని వివరించామని, ఇందులో తమ నిర్లక్ష్యం ఏమి లేదని తెలిపారు. 

చదవండి: 20 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణాలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు