అనగనగా.. ఓ అపార్ట్‌మెంట్‌: కలిసి ముచ్చట్లు బంద్‌

24 May, 2021 09:25 IST|Sakshi

వాట్సాప్‌ గ్రూపు ద్వారానే సందేశాలు

అంతా స్వీయ జాగ్రత్తలు పాటించేలా కమిటీ పర్యవేక్షణ

ఖమ్మం అర్బన్‌: మొదటి దఫా కరోనా తీవ్రతతో అప్రమత్తమై.. ప్రస్తుత రెండోదశలో అంతా స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నామని ఖమ్మంలోని 10వ డివిజన్‌ చైతన్యనగర్‌లోని ఎస్‌కేటీ అపార్ట్‌మెంట్‌వాసులు ఉంటున్నారు. ఇక్కడి 25 కుటుంబాల వారు కలిసికట్టుగా ఉండి.. ఐక్యంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నామంటున్నారు. గతంలో మాదిరిగా ఇరుగు పొరుగు వారంతా కలిసి ముచ్చట్లు పెట్టుకునేందుకు ఇక్కడ అనుమతి లేదు. వాకింగ్‌ను నిలిపివేశారు. వీలుంటే ఎవరింట్లో వారే, వరండాల్లో చేసుకోవచ్చు. కోవిడ్‌ –19 అలర్ట్‌..పేరిట ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను రూపొందించుకుని..జాగ్రత్తలు, సూచనలు, సందేశాలు పంపించుకుంటున్నారు. కోవిడ్‌ మొదట దశలో కొంతమంది కరోనా బారిన పడితే వారికి అండగా నిలిచారు. నిత్యం అపార్ట్‌మెంట్‌లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తున్నారు. హైపోక్లోరైట్‌ ద్రావణంతో శానిటైజేషన్‌ చేయిస్తున్నారు. బయటి వ్యక్తులు ఎవరొచ్చినా కచ్చితంగా మాస్క్‌ ధరించాల్సిందే. మాస్క్‌ లేకుంటే లోనికి ప్రవేశం నిలిపివేశారు. బంధువుల రాకపోకలను కూడా గడిచిన 20 రోజుల నుంచి నిలిపివేశారు. రెండు ప్రవేశ ద్వారాలు ఉండగా ఒకదానాని పూర్తిగా మూసి వేశారు. ప్రతి ఫ్లోర్‌లో లిఫ్ట్‌ పక్కనే శానిటైజర్‌ ఏర్పాటు చేశారు.

బాధ్యతగా ఆచరిస్తాం..
కరోనా విపత్కర పరిస్థితిలో నిబంధనలను అంతా బాధ్యతగా ఆచరిస్తాం. అందుకే సురక్షితంగా ఉన్నాం. ఒకరికొకరం అనేలా అందరం సహకరించుకుంటున్నాం. వాకింగ్, కారిడార్‌ ముచ్చట్లను తాత్కాలికంగా నిలిపివేశాం. అవగాహన కల్పించుకుంటున్నాం.              
- గుడిపుడి రామారావు, అపార్ట్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు

మాస్క్, శానిటైజర్‌ ఉండాలి..
క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. వెంట శానిటైజర్‌ డబ్బా ఉంచుకోవాల్సిందే. ఇక ఆవరణలో బ్లీచింగ్‌ చల్లిస్తున్నాం. హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయిస్తున్నాం. మాస్క్‌ ఉంటేనే లోపలికి రావాలని ఫ్లెక్సీ కూడా గేటు వద్దనే పెట్టించాం. 
- జాస్తి ప్రసాద్, అసోసియేషన్‌ కార్యదర్శి

తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
అపార్ట్‌మెంట్‌లోని అన్ని కుటుంబాలు నిత్యం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉన్నాం. వాచ్‌మెన్‌ కూడా భద్రంగా ఉండేలా చూస్తుంటాం. కరోనా కట్టడికి అవసరమైన అన్ని రకాల పనులు చేస్తుంటాం. అవగాహన కల్పించుకుంటున్నాం. 
- జర్పుల కుమారి, అపార్ట్‌మెంట్‌ నివాసి

మరిన్ని వార్తలు