రండి బాబూ రండి..  అంతా ఉచితం.. అన్నీ చూసుకుంటాం

16 Sep, 2021 20:30 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

 విద్యార్థుల కోసం ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల పాట్లు

ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ గాలం

సీట్లు మిగిలిపోతుండడంతో ఎత్తులు.. పైఎత్తులు

జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యాడు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో చదివించాలన్న ఉద్దేశంతో వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చేశారు. ఈవిషయం తెలుసుకున్న ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి తమ కళాశాలలో చేరాలని కోరింది. ఫీజు చెల్లించకున్నా పర్వాలేదని, కావాలంటే తామే రూ.10వేల వరకు ఇస్తామని చెప్పినా వారు కాదన్నారు.

మరో విద్యార్థినికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె బంధువులు వరంగల్‌లో ఉండడంతో అక్కడే చేరాలని వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చేసింది. కానీ ఇక్కడి ఓ కళాశాల ఉద్యోగులు వెళ్లి తమ వద్ద చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అకడమిక్‌ ఫీజు చెల్లించక్కర్లేదని, కేవలం బస్సు ఫీజు చెల్లిస్తే చాలని చెప్పా రు. దీంతో వెబ్‌ ఆప్షన్లు మార్చుకునేందుకు గురువారం వరకు అవకాశమున్నందున ఆలోచిస్తామని వారు బదులిచ్చారు.

సాక్షి, ఖమ్మం : జిల్లాలోని కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు బోసిపోతున్నాయి. కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నా.. విద్యార్థులు జిల్లాలోని కళాశాలలను ఎంపిక చేసుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఎలాగైనా సీట్లు నింపాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం షాపింగ్‌ మాల్స్‌ తరహాలో విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. ఇక మరికొన్ని కళాశాలల్లోనైతే అంతా ఉచితం.. అన్నీ మేమే చూసుకుంటాం.. తమ కళాశాలలో చేరితే సరిపోతుందని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థుల చిరునామాలు సేకరించి ఇళ్లకు వెళ్లి తమ ఆఫర్లను వివరిస్తూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

మారిన పరిస్థితులతో..
విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వినియోగించి కొత్త ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోసేదే ఇంజనీరింగ్‌ విద్య. కోర్సులో చేరాక ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందే వ్యక్తులు సదరు సంస్థ పురోభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తేనే సహజ ప్రతిభ కలిగి ఉన్నట్లు లెక్క. అయితే కొన్నేళ్లుగా ఇంజనీరింగ్‌ విద్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా కళాశాలలు ఏర్పడడం, పెరగడం.. తదనుగుణంగా విద్యార్థులు లేకపోవడంతో సీటు లభించడం సులభమైంది. మంచి పేరున్న కళాశాలల్లో మినహా మిగిలిన కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం కష్టంగా మారింది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో కళాశాలల యాజమాన్యాలు సీట్లు భర్తీ చేసుకునేందుకు నానాపాట్లు పడక తప్పడం లేదు.

3,500 సీట్లు భర్తీ అయ్యేనా ?    
జిల్లాలో ఎనిమిది ఇంజనీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఉంది. వీటిలో అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి 3,500 వ రకు సీట్లు ఉన్నాయి. ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఇటీవల పూర్తికాగా, కళాశాలల ఎంపికకు ఈనెల 11 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. ఇది గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు తమ కళాశాలలను ఎంచుకునేలా యజమానులు రంగంలోకి దిగారు. సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టిన ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల వద్దకే తమ సిబ్బందిని పంపించి విద్యార్థులను మచ్చిక చేసుకునేందుకు య త్నించారు. కానీ ఎక్కువ మంది హైదరాబాద్, వరంగల్‌లోని కళాశాలలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా తమ కళాశాలల్లో సీట్లు నిండేలా చూసేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారు.

చేరితే చాలు బాబోయ్‌
జిల్లాలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. ఈక్రమంలో విద్యార్థులు కళాశాలలో చేరితే చాలు అనే పరిస్థితికి యాజమాన్యాలు వచ్చేశాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం సౌకర్యాలకు అనుగుణంగా ఫీజు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో కొన్ని కళాశాలల్లో రూ.35వేల నుంచి రూ.85వేల వరకు ఫీజు ఉండగా అదనంగా మరి కొంత ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పోగా విద్యార్థులు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు ఫీజు చెల్లించా ల్సి వచ్చేది.

దీంతో పాటు బిల్డింగ్, బస్‌ తదితర ఫీజులు కలిపితే రూ.30వేల నుంచి రూ.60వేల వర కు ఏటా ఖర్చవుతుంది. అయితే విద్యార్థులు ఇతర ప్రాంతాల వైపు దృష్టి సారిస్తుండడంతో జిల్లాలోని కళాశాల యజమానులు ఫీజులు తగ్గిస్తుస్తున్నారు. మరికొందరైతే విద్యార్థులకు ఉచిత విద్య ఆఫర్‌ ఇవ్వడమే కాకుండా మెరుగైన ర్యాంకు సాధించిన వారికి ఎదురు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. వెబ్‌ ఆప్షన్ల ప్రక్రి య గురువారం ముగియనుండడంతో యజమానులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు