Kharjura Kallu: నోరూరిస్తున్న కర్జూర కల్లు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి, ధర కూడా తక్కువే!

22 Nov, 2022 11:52 IST|Sakshi

సహజసిద్దంగా చెట్ల నుంచి లభించే కల్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణప్రాంత ప్రజలైతే మరింత ఆసక్తి చూపుతారు. తీపి, ఒగరు, పులుపుగా ఉండే కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిస్తే ఇక జనం ఆగరు. ఇప్పటి వరకు మనకు తాటి, ఈత, వేప కల్లు మాత్రమే తెలుసు. కానీ కర్జూర చెట్లు సైతం కల్లునిస్తు జనాన్ని ఫిదా చేస్తున్నాయి. జనగామ జిల్లాలో కర్జూర కల్లు జనాలకు మజానిస్తోంది. ప్రజల మనసు దోచుకుంటున్న ఈ ప్రత్యేక పానీయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

గ్రామీణ ప్రాంతాల్లో కల్లు సేవించడం సంప్రదాయంగా ఉంది. అయితే తాటికల్లు, ఈత కల్లు మాత్రమే జనాలు ఎక్కువగా సేవించేవారు. కానీ, తాజాగా కర్జూర కల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన ఈకల్లు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తోంది. కిడ్నీల్లో రాళ్లను పోగొడుతుందని కల్లు ప్రియులు అంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ లో కొందరు రైతులు కర్జూర చెట్లను సాగుచేశారు. ఆచెట్ల నుంచి స్థానిక గౌడకులస్థులు కల్లు తీస్తు జనాలను ఆకర్షిస్తున్నారు.
(చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు)

సాధారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్నిసార్లు తియ్యగా ఉంటుంది. కొన్నిసార్లు వగరుగానూ ఉంటుంది. ఈత, తాటికల్లు సేవించేందుకు కొందరు ఇష్టపడరు. కానీ, కర్జూర కల్లు మాత్రం తియ్యగా, టేస్టీగా ఉండడంతో అందరూ తాగుతున్నారు. తెల్లారిందంటే చాలు చెట్ల క్రిందికి చేరిపోతున్నారు.‌ కర్జూర కల్లు టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతోందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రాఘవాపూర్ కర్జూర కల్లుకు ఒకబ్రాండ్ గా మారింది. ఒకసారి ఈకల్లు తాగినోళ్లు పదేపదే వస్తున్నారు. దీని టేస్ట్ గురించి తెలుసుకుని వరంగల్, జనగామ ప్రజలతో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలివస్తున్నారు. ఉదయమే కర్జూర కల్లు తాగితే చాలా అద్భుతంగా ఉంటుందని కల్లుప్రియులు చెబుతున్నారు. 

మరో ప్రత్యేకత
తాటిచెట్లు, ఈతచెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ కర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇవ్వడం ఈచెట్ల ప్రత్యేకత. రాఘవాపూర్ లో ఐదు కర్జూర చెట్లు ఉండగా ఒక్కో చెట్టు రోజుకు 20 లీటర్ల కల్లు పారుతుంది. లీటర్ కు వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. అమృతంలా ఆరోగ్యానికి మేలుచేస్తుండడంతో కర్జూర కల్లు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని గౌడ కులస్తులు తెలిపారు. డిమాండ్ బాగానే ఉన్నా  చెట్లు తక్కువగా ఉండి అందరికీ కల్లు అందించలేక పోతున్నామని అంటున్నారు.

ఇక డిమాండ్ కు తగ్గట్లు సప్లై లేక చాలా మంది కల్లు దొరక్క నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. ప్రభుత్వం హరితహరం క్రింద రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ భూముల్లో కర్జూర చెట్లు పెంచి తమ ఉపాధి మెరుగుపర్చాలని కల్లుగీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన కర్జూర కల్లును అందిస్తామంటున్నారు. 
(చదవండి: పోలీసులందు ఈ పోలీస్‌ వేరయా.. దొంగలతో చేతులు కలిపి ‘ముఠా’ నేతగా ఎదిగి)

మరిన్ని వార్తలు