భేతాళపాడుకు వైద్యాధికారులు

12 Oct, 2021 03:45 IST|Sakshi
రక్తనమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది   

కిడ్నీ వ్యాధి బాధితులనుంచి రక్త నమూనాల సేకరణ  

జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిధిలో కిడ్నీ వ్యాధి బాధితులు, అనుమానితుల నుంచి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సోమవారం రక్త నమూనాలు సేకరించారు. ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ‘ఆ ఊరికి ఏమైంది..?’శీర్షికతో కిడ్నీ వ్యాధి పీడితులపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శిరీష ఆదేశాల మేరకు జూలూరుపాడు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ భూక్యా వీరబాబు భేతాళపాడు పంచాయతీ పరిధిలోని పంతులుతండాలో వైద్యశిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధి బాధితులు, అనుమానితుల ఇళ్లకు వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పోటు వినోద్‌ వైద్యశిబిరాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం టీ హబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు దీనితో తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తాగునీటి శాంపిళ్లు సేకరించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. 

మరిన్ని వార్తలు