చిన్నారికి సరికొత్త జీవితం!

28 Jul, 2020 09:19 IST|Sakshi
ఆపరేషన్‌కు ముందున్న గ్రీష్మిక ఆపరేషన్‌కు ముందు.. తర్వాత ఇలా...

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స 

జీవితకాల వైకల్యం నుంచి  ఆరేళ్ల పాపను కాపాడిన ‘కిమ్స్‌’ వైద్యులు 

గచ్చిబౌలి: జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సిన ఆరేళ్ల గ్రీష్మికకు కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వివరాలివీ... గ్రీష్మిక వెన్నెముక వైకల్యంతో జన్మించింది. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ చిన్నారిని మార్చిలో ఆమె తల్లిదండ్రులు కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాపను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమెకు పుట్టకతోనే గూని ఉందని వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ కె.కృష్ణ చైతన్య గుర్తించారు. ఇది చాలా క్లిష్టమైనది కావడంతో బాలికకు ఒకసారి కాకుండా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసి ఆమెకు 13 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రాడ్‌ను పొడిగిస్తూ పోవాలి. వెన్నెముక ఎదుగుదలతోపాటే రాడ్‌ పొడవు కూడా పెంచాలి. అప్పుడే సమస్య పూర్తిగా నయమవుతుంది. సాధారణంగా ప్రతి 2 వేల మందిలో ఒకరికి ఇలా పుట్టుకతోనే గూని వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లలకు ఇది రావడంతో వాళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

శస్త్రచికిత్స ద్వారా గ్రోయింగ్‌రాడ్‌ వేశాం: డాక్టర్‌ కృష్ణచైతన్య
వైకల్యం కారణంగా గ్రీష్మిక చిన్నచిన్న ఆనందాలకూ దూరమైందని కిమ్స్‌ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ కృష్ణచైతన్య సోమవారం తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ఆమెకు గ్రోయింగ్‌రాడ్‌ వేయాల్సి వచ్చిందని, పాపకు 13 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆమె ఎదుగుదలకు ఇది అత్యవసరమని గుర్తించి వేశామన్నారు.

మొదటి శస్త్రచికిత్స 2019 మార్చిలో చేసి అందులో డి3/డి4, ఎల్‌3/ఎల్‌4 వద్ద యాంకర్‌ స్క్రూలు బిగించామన్నారు. రెండో శస్త్రచికిత్సను ఈ నెలలోనే చేసి ఆ స్క్రూలను కొంత విస్తరించామన్నారు. మొదటి చికిత్సకు ఆరు గంటల సమయం పట్టిందని, రాడ్లు, స్క్రూలు వేసి వెన్నెముకను సరిచేశామన్నారు. ఇందుకోసం మేము ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరల్‌ మానిటరింగ్‌ 3డి ప్రింటింగ్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించామన్నారు. చిన్న వయసులో గుర్తిస్తే పిల్లల్లో ఇలాంటి వైకల్యాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా చక్కగా నయం చేయవచ్చన్నారు. సమావేశంలో ఆర్థోపెడిక్‌ స్పైన్‌ విభాగాధిపతి డాక్టర్‌ అన్నె సాయిలక్ష్మణ్, ట్రామా అండ్‌ ఆర్థోస్కోపీ సర్జన్‌ డాక్టర్‌ సి.ఆర్‌.సురేష్‌బాబు, మత్తు వైద్య నిపుణుల బృందం పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా