డాక్టర్‌పై అంబులెన్స్‌ డ్రైవర్‌ దాడికి యత్నం 

15 May, 2021 09:01 IST|Sakshi

కింగ్‌కోఠి వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద రభస 

హిమాయత్‌నగర్‌: తాను చెప్పిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదంటూ అంబులెన్స్‌ డ్రైవర్‌ వ్యాక్సిన్‌ ఇన్‌చార్జి డాక్టర్‌పై దాడికి యత్నించాడు. ఈ సంఘటన కింగ్‌కోఠి ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. డాక్టర్‌ సాధన తెలిపిన మేరకు.. ఐదు రోజులగా కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేస్తున్నారు. ఆసుపత్రి అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ముఖేష్‌కు వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారి పేర్లు నమోదు చేసుకునే పనిని సూపరిటెండెంట్‌ రాజేంద్రనాధ్‌ ఇటీవల అప్పగించారు.

సిబ్బంది తక్కువగా ఉండటంతో సాయం కోసం ఈ పని చేశారు. అయితే ముఖేష్‌ తనకు సంబంధించిన వారి ఆధార్‌ జిరాక్స్‌ పత్రంపై సంతకం చేసి కోవ్యాక్సిన్‌ వద్దకు పంపుతున్నాడు. ఎవరైనా అడిగితే సెకెండ్‌ డోస్‌ అని చెప్పాలని సూచిస్తున్నాడు. ఇది గమనించిన డాక్టర్‌ సాధన.. ముఖేష్‌ను ప్రశ్నించింది. దీంతో అతను నానా రభస చేశాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు డాక్టర్‌ ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సూపరిటెడెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాధ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. 

చదవండి: బావిలో పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు 

మరిన్ని వార్తలు