ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి

4 Mar, 2023 01:36 IST|Sakshi

రైతులు అధిక దిగుబడులు సాధించాలి 

కిసాన్‌ అగ్రి షో ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి 

వినూత్న ఆవిష్కరణలు వ్యవసాయ స్వరూపాన్ని మారుస్తున్నాయని వెల్లడి 

విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు పండించాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌/ మాదాపూర్‌: సాగులో నూతన పద్ధతులు, ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉంటూ వ్యవసాయ రంగ స్వరూపాన్ని మారుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పా రు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. పంటల సాగు కు అనేక రాయితీలను అందిస్తున్నట్టు తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కిసాన్‌ అగ్రి షో–2023ను కిసాన్‌ ఫోరమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కన్వినర్‌ నిరంజన్‌ దేశ్‌పాండేతో కలిసి మంత్రి ప్రారంభించారు. నగరంలో ఇంత భారీ స్థాయిలో అగ్రి ఎక్స్‌పో జరగడం ఇదే మొదటిసారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న పలు ఆవిష్కరణలను చూస్తుంటే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కచ్ఛితంగా వ్యవసాయ పరిశ్రమల్లో ఒక మార్పు తీసుకురాగలదని అనిపిస్తోందని అన్నారు. వినూత్న ఆవిష్కరణలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని అధిక దిగుబడులను పొందాలని రైతులకు సూచించారు.

మనకు అవసరమైన పంటలతో పాటు విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను పండించాలని కోరారు. దేశంలో పప్పు దినుసులు, వంటనూనెల కొరత నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ, ప్రపంచ అవసరాలకు సరిపడే విధంగా రైతాంగం తమ పంటలను పండించేలా కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి కోరారు.  

నూతన సాంకేతికతల వినియోగానికి..
హైదరాబాద్‌లో ఈ తరహా భారీ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడంపై నిరంజన్‌ దేశ్‌ పాండే హర్షం వ్యక్తం చేశారు. వ్యవ సాయ రంగంలో నూతన సాంకేతికతల వినియోగానికి ఈ ప్రదర్శన బాట వేయగలదన్నారు. 20కి పైగా అగ్రి స్టార్టప్స్‌ నూతన సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. జ్ఞాన కేంద్రం వద్ద రైతులు తెలంగాణకు పనికొచ్చే నూతన సాంకేతికతల గురించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారని చెప్పారు.  

160కి పైగా కంపెనీల అనుసంధానం
అగ్రి స్టార్టప్స్‌ ప్రత్యేక విభాగమైన స్పార్క్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌), రాష్ట్ర వ్యవసాయ వర్సిటీల క్లస్టర్‌ జ్ఞాన కేంద్రం సహా పెద్ద సంఖ్యలో ప్రధాన పరిశ్రమలు ఈ షో కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. మూడురోజుల పాటు కొనసా గే ఈ ఎక్స్‌పోలో 150కి పైగా ఎగ్జిబిట ర్లు పాల్గొంటున్నా రు. ఈ వేదిక ద్వారా 160కి పైగా కంపెనీలు అనుసంధానం కాగలవని అంచనా.

ఆకట్టుకుంటున్న స్టాళ్లు..
అగ్రి ఇన్‌పుట్, నీటి నిర్వహణ, పరికరాలు, ఉపకరణాలు, విత్తనాలు, ప్లాంటింగ్‌ మెటీరియల్‌కు సంబంధించిన స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయి. భారీ యంత్రాలు, ఉపకరణాలను ప్రదర్శనకు ఉంచారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగా అభివృద్ధి చేసిన ఎన్నో వినూత్న వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు.  

మరిన్ని వార్తలు