ఏడాది పాటు విమోచన దినోత్సవాలు

17 Sep, 2022 02:07 IST|Sakshi

రసూల్‌పుర : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూరైన సందర్భంగా ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అందులోభాగంగా హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. శుక్రవారం పరేడ్‌ మైదానంలో విమోచన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కిషన్‌రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ...విమోచన దినోత్సవాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఆధ్వర్యంలో నేడు జరగనున్న కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, మహరాష్ట్ర సీఎం ఏకనాథ్‌ షిండే హాజరవుతారని చెప్పారు. సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌లతో పాటు మొత్తం 12 సైనికదళాలు (రెండు మహిళా బృందాలతో సహా) ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొని దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ మెటీరియల్, చక్రాల కుర్చీలు, కృత్రిమ తయారీ పరికరాలు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, డా, ప్రకాశ్‌రెడ్డి, రాకేశ్, శ్రీవర్ధన్, రాముయాదవ్, చింతల రాం చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు

మరిన్ని వార్తలు