వారే అసలైన ‘బయ్యారం’ దోషులు.. కేసీఆర్‌, ఆయన కుటుంబంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం 

1 Oct, 2022 03:26 IST|Sakshi

ఉక్కు ఫ్యాక్టరీపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపాటు

సాక్షి, న్యూఢిల్లీ: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన దోషులని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 2014లో అధికారంలోకి రాగానే మోదీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఆ కమిటీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని నివేదిక ఇచ్చిందని.. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే జరిగిందని గుర్తుచేశారు. ఆ నివేదికకే కేంద్రం, బీజేపీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2018లో ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. కమిటీ కూడా ఆ ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని పేర్కొందన్నారు. అయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందన్నారు.  

దమ్ముంటే సొంతంగా కట్టండి... 
కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘కేంద్రం కట్టకపోతే మేమే బయ్యారం ఫ్యాక్టరీని కడతాం. సింగరేణి, టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో బయ్యారం ఫ్యాక్టరీని నిర్మిస్తాం. 10 నుంచి 15 వేల మందికి ఉపాధి కల్పిస్తాం’ అంటూ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. సీఎం, ఆయన కుటుంబానికి చేతనైతే, దమ్ముంటే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని కట్టాలని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చేశా రు.  ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం నిలబెట్టుకోలేకపోయారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు