దివ్యాంగ జవాన్లు సైబర్‌ వారియర్స్‌

11 Dec, 2020 09:11 IST|Sakshi

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి  

సీఆర్పీఎఫ్‌లో ‘దివ్యాంగ్‌ సాధికారత కేంద్రం’ప్రారంభం 

జవహర్‌నగర్‌(హైదరాబాద్‌): దేశ అంతర్గత భద్రతలో సైబర్‌ వార్‌ కూడా ప్రధానమైందని దివ్యాంగ జవాన్లను సైబర్‌ వారియర్స్‌గా తీర్చి దిద్దుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆటంకాలెన్ని ఎదురైనా ధృఢసంకల్పంతో లక్ష్యాన్ని ఛేదిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జనాన్ల సేవలు మరువలేనివన్నారు. గురువారం జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో దివ్యాంగ సైనికుల నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ‘దివ్యాంగ్‌ సాధికారత’కేంద్రాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించి జవానులు నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు దేశ రక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుంటారని నక్సల్స్‌ ఏరివేతలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. దేశ రక్షణలో భాగంగా కొన్ని అనుకోని సంఘటనల్లో గాయపడ్డ జవాన్లకు కేంద్రం ఎల్లప్పుడూ సహాయంగా ఉంటుందన్నారు. సైనికుల శారీరక సామర్థ్యాన్ని, వివిధ రంగాల్లో వారి నైపుణ్యతను పెంచేలా ఈ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారిని పారా స్పోర్ట్స్‌లో శిక్షణనిచ్చి విదేశాలలో పారా గేమ్స్‌లో పోటీ చేయిస్తామన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో దాదాపు 500పైగా జవాన్ల పిల్లలు దివ్యాంగులుగా ఉంటున్నారని వారందరికీ ఈ కేంద్రం దోహదపడుతుందని చెప్పారు.  (చదవండి: పద్దెనిమిదేళ్ల తర్వాత పరిహారం)

దివ్యాంగ జవాన్లతో కలిసి ఆటలాడిన కిషన్‌రెడ్డి  
అనంతరం కిషన్‌రెడ్డి దివ్యాంగ సైనికులకు అందుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇతర సదుపాయాలను పరిశీలించి సైనికులతో కలసి బ్యాడ్మింటన్‌ ఆడి వారిలో మరింత ఆత్మౖస్థైర్యాన్ని నింపారు. సమావేశంలో పద్మశ్రీ ఖేల్‌రత్న అవార్డు గ్రహీత దీపా మాలిక్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌సెక్టార్‌ ఐజీ సంజయ్‌ ఎ.లాత్కర్, సీఆర్‌పీఎఫ్‌ డీజీ డాక్టర్‌ ఎ.పి.మహేశ్వరీ, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, పద్మశ్రీ డాక్టర్‌ దీపా మాలిక్, బీఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు, జవాన్లు పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు