రాష్ట్ర వాటా చెల్లిస్తేనే రెండో దశ పనులు 

17 Jan, 2021 12:20 IST|Sakshi

ఎంఎంటీఎస్‌పై చొరవ చూపాలంటూ కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: నగర ప్రజా రవాణాలో ఎంతో కీలకంగా మారినందున ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు వే గంగా పూర్తయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కోరారు. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవటంతో పనులు నిలిచిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు. ‘ఆరేళ్ల క్రితం రూ.816.55 కోట్ల అంచనాతో రెండో దశ పనులు మొదలయ్యాయి.

ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.544.36 కోట్లు రైల్వేకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ.129 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగతావి బకాయి ఉన్నాయి. రైల్వే శాఖ తన వాటాకు కొన్ని రెట్లు అధికంగా రూ.789.28 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవటంతో పనులు నిలిచిపోయాయి. జాప్యంవల్ల ప్రస్తుతం అంచనా రూ.951 కోట్ల కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా రూ.634 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక యాదాద్రిని ఈ ప్రాజెక్టుతో అనుసంధానించే లా కేంద్ర ప్రభుత్వం రూ.412 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ఊపింది. రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ లైన్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ.75 కోట్లు సమకూర్చాలని రైల్వే కోరింది. ఆ డబ్బు చెల్లించకపోవటంతో పనులు మొదలు కాలేదు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా నేను శాయశక్తులా కృషి చేస్తాను’అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు