‘కైటెక్స్‌’ పెట్టుబడి మరో 1,400 కోట్లు

19 Sep, 2021 02:04 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూ పత్రాలను ఇచ్చిపుచ్చుకుంటున్న పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్, కైటెక్స్‌ ఎండీ సాబు జాకబ్‌. చిత్రంలో మంత్రులు సబిత, ఎర్రబెల్లి

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో సమీకృత దుస్తుల తయారీ క్లస్టర్లు

వచ్చే ఏడాది నవంబర్‌లో కార్యకలాపాలు.. 

85% ఉద్యోగాలు మహిళలకే

22 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన

ఇప్పటికే రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టిన ‘కైటెక్స్‌’ సంస్థ

సాక్షి, హైదరాబాద్‌: వివిధ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం ముందున్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. చిన్నపిల్లల దుస్తుల తయారీ రంగంలో అమెరికాకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న కైటెక్స్‌ సంస్థ సమీకృత దుస్తుల తయారీ క్లస్టర్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కైటెక్స్‌ ఎండీ సాబు జాకబ్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్‌ పాల్గొన్నారు. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్‌ సృష్టికర్త ఎవరో తెలుసా...!

రూ. 2,400 కోట్లతో వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుతోపాటు రంగారెడ్డి జిల్లా చందనవెల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసే రెండు దుస్తుల తయారీ క్లస్టర్ల ద్వారా 22 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. కేరళ నుంచి రూ. 3,500 కోట్ల పెట్టుబడులను ‘కైటెక్స్‌’ ఉపసంహరించుకుంటోందనే వార్తను ఓ పత్రికలో చూసి ఆ సంస్థను రాష్ట్రానికి రప్పించేం దుకు చేసిన ప్రయత్నాలను వివరించారు. కేవలం 3 రోజుల వ్యవధిలోనే కైటెక్స్‌ సంస్థ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా తాజాగా మరో రూ. 1,400 కోట్లను కూడా పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించిందన్నారు.

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ, సహకారాలను, తమ ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. ఈ కంపెనీల స్థాపన పూర్తయ్యాక రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో పండే పత్తిని కైటెక్స్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కేటీఆర్‌ అన్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ‘కైటెక్స్‌’ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ఉద్యోగాల్లో 85 శాతం మహిళలకే దక్కుతాయన్నారు. స్థానికులకు ఉపాధి దక్కేలా వారికి అవసరమైన శిక్షణ కార్యకలాపాలను ప్రభుత్వం తరఫున చేపడతామని, ఈ విషయంలో స్థానిక మహిళా సంఘాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులు, మంత్రులకు కేటీఆర్‌ సూచించారు. ‘కైటెక్స్‌’ కొనుగోలు చేసే పత్తి ద్వారా స్థానిక రైతాంగానికి మేలు జరుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చదవండి: శభాష్‌ శ్రీజ.. పదో తరగతిలోనే స్టార్టప్‌కి శ్రీకారం

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం: సాబు జాకబ్‌
రెండేళ్ల వయసులోపు పిల్లలకు దుస్తులు తయారు చేయడం తమ కంపెనీ ప్రత్యేకతగా కైటెక్స్‌ ఎండీ సాబు జాకబ్‌ తెలిపారు. అమెరికాలో తమ కంపెనీ తయారు చేసే దుస్తులను ప్రతి కుటుంబంలోని చిన్నారులు ధరిస్తున్నారని, ప్రస్తుతం కేరళ నుంచి ఏటా 10 లక్షల డ్రెస్‌లను అమెరికాకు ఎగుమతి చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసే సమీకృత దుస్తుల తయారీ క్లస్టర్ల ద్వారా ఏటా 30 లక్షల దుస్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తామని జాకబ్‌ ప్రకటించారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిన కాకుండా పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తిస్తామని, ప్రతి ఒక్కరికీ పీఎఫ్, హెల్త్‌ కార్డులు, సబ్సిడీ ధరలకు నిత్యావసరాలతోపాటు ఇతర వసతులు కల్పిస్తామన్నారు. ఉత్పత్తులు, లాభాలతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని జాకబ్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి రూ. 6 కోట్ల విలువ చేసే 1.50 లక్షల పీపీఈ కిట్లను ఇస్తున్నట్లు జాకబ్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, కాలె యాదయ్య, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, పరిశ్రమల శాఖ కమిషనర్‌ కృష్ణ భాస్కర్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, కైటెక్స్‌ ప్రతినిధులు సోధి, సామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు