సీపీఆర్‌పై అవగాహన అవసరం 

14 Mar, 2023 01:31 IST|Sakshi

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ చైర్మన్‌ అజయ్‌ మిశ్రా  

ఎన్‌సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు సీపీఆర్‌పై శిక్షణ  

పంజగుట్ట: మన దేశంలో ప్రతి నిమిషానికి 112 కార్డియాక్‌ అరెస్టులు సంభవిస్తున్నాయని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ చైర్మన్, మాజీ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 80 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతున్నాయని, సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ, ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సంయుక్తంగా సీపీఆర్‌పై ఎన్‌సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ నెలలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించనున్న సీపీఆర్‌ అవగాహన, శిక్షణ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్‌ మిశ్రా మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్‌ మాదిరిగా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని కోరారు. నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్‌ అశిమా శర్మ మాట్లాడుతూ.. సీపీఆర్‌ చేసే సమయంలో స్కిల్స్‌ ఎంతో ముఖ్యమని, బ్రీతింగ్, నాడి చూడాలని, భుజం తట్టి స్పందిస్తున్నారో లేదో చూడాలన్నారు.

సీపీఆర్‌ చేస్తూనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు నిమ్స్‌లో పారామెడికల్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సీపీఆర్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.విజయ్‌భాస్కర్, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్‌.రవికాంత్‌ రెడ్డి, కె.మదన్‌మోహన్‌రావు, రమణ పాల్గొన్నారు.   


 

మరిన్ని వార్తలు