జీవో 5ను యథావిధిగా అమలు చేయాలి 

27 Sep, 2021 03:01 IST|Sakshi
మహాధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. చిత్రంలో ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మెల్యే సీతక్క  

ప్రొఫెసర్‌ కోదండరాం 

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా 

మద్దతు తెలిపిన సీతక్క, నర్సిరెడ్డి

కవాడిగూడ (హైదరాబాద్‌): ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పించాలని, అందుకోసం జీవో 5ను యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే జీవో నంబర్‌ 2ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, జాక్టో చైర్మన్‌ సదానంద్‌గౌడ్‌ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన పోరాటాలకు టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. దేశంలో నేటికీ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చట్టసభల్లో ప్రస్తావించడంతోపాటు ప్రత్యక్షంగా చేసే పోరాటాల్లో కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారు.  

మరిన్ని వార్తలు