డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి కన్నుమూత 

9 Mar, 2021 03:09 IST|Sakshi

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి (74) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లూరి చిరంజీవి గత నెల 19న ఏఐజి ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే మంత్రి కేటీఆర్‌ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం నారాయణగూడలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. 1947 ఫిబ్రవరిలో వరంగల్‌లో ఆయన జన్మించారు. తల్లి టీచర్, తండ్రి రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి.

కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివే రోజుల్లోనే ఆయన విద్యార్థి సంఘం నేతగా చురుకుగా పనిచేశారు. మెడికల్‌ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే డాక్టర్‌ చంద్రావతిని ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నారు. 1969 ఉద్యమకారుల సమాఖ్య ఏర్పాటుచేసి సమస్యలపై పోరాటం చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో చేరి కొండపల్లి సీతారామయ్యకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తర్వాత బీఎస్పీలో చేరి కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులకు దిశానిర్దేశం చేశారు.

మంత్రి కేటీఆర్‌ నివాళి 
కొల్లూరి భౌతికకాయం వద్ద మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండా ప్రకాశ్, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, మందకృష్ణ మాదిగ, జై భీంటీవీ సీఈవో శ్రీధర్‌ తదితరులు కొల్లూరి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు సంతాపం ప్రకటించారు.  

మరిన్ని వార్తలు