కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. సరిహద్దుల్లో సందర్శనీయం

28 Mar, 2022 22:59 IST|Sakshi

ఆధ్యాత్మిక కేంద్రాలు

వేసవిలో పర్యటనకు అనుకూలం  

చింతలమానెపల్లి(సిర్పూర్‌): కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం తగ్గింది. ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావం తగ్గడం.. నిబంధనలు సడలించడం కారణంగా ఈ వేసవిలో పర్యాటక ప్రాంతాలను చుట్టి రావాలనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులోనూ సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి.

కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. వచ్చే నెల 13నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతాలన్ని ప్రాణహిత నది చుట్టుపక్కల ఉన్నాయి. అటు పుష్కరస్నానం.. ఇటు పర్యాటక ప్రాంత సందర్శన రెండూ సాధ్యమవుతాయి. జిల్లా సరిహద్దులోని సందర్శనీయ స్థలాలపై ప్రత్యేక కథనం.

బామ్రాఘడ్‌.. వన్యప్రాణుల నిలయం
కుమురంభీం జిల్లాను ఆనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలోని బామ్రాఘడ్‌ ప్రాంతం ప్రకృతి రమణీయతను చాటుతోంది. తహసీల్‌గా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఈ ప్రాంతం జిల్లాలోని సరిహద్దు మండలం చింతలమానెపల్లి నుంచి 80కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బామ్రాఘడ్‌లోని హెమల్‌కాస వద్ద సామాజిక సేవా కార్యకర్త బాబా ఆమ్టె ఆధ్వర్యంలో లోక్‌బిర్దారి ప్రకల్ప్‌ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.

గిరిజనులకు ఉచితంగా వైద్యం చేస్తారు. ఆస్పత్రి ఆవరణలో వన్యప్రాణుల సందర్శనశాల(జూ పార్కు) ఉంది. చిరుత పులులు, ముళ్ల పందులు, ఎలుగుబంట్లు ఇలా ఎన్నో రకాల అరుదైన జంతువులు ఉన్నాయి. బామ్రాఘడ్‌ సమీపంలో ఇంద్రావతి నది త్రివేణి సంగమం అరుదైనదిగా చెబుతుంటారు. ఇంద్రావతి, వాముల గౌతమి, వర్లకోట నదుల కలయికతో సంగమ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, ప్రయాణంలో కనిపించే దృశ్యాలు, అటవీ అందాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటాయి. బామ్రాఘడ్‌ వెళ్లే మార్గంలో వచ్చే గ్లోరీ ఆఫ్‌ ఆల్లపల్లి చూడాల్సిన ప్రదేశం..

కమలాపూర్‌.. గజరాజుల అడ్డా
చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్‌ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. 10 వరకు పెద్ద ఏనుగులు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. స్థానిక అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఏనుగుల సంరక్షకుల సమక్షంలో సందర్శకులు నేరుగా పండ్లు, ఆహారం అందించవచ్చు. ఈ కేంద్రాన్ని స్థానికంగా హాథీ క్యాంప్‌ అని పిలుస్తారు. ఇక్కడి రిజర్వాయర్, అటవీ అందాలు, చల్లెవాడ రాబందుల సంరక్షణ కేంద్రం, ఏనుగు రూపంలో ఉన్న కొండ సందర్శకులను ఆకట్టుకున్నాయి. 

చెప్రాడ ప్రశాంత ధాం 
చెప్రాడ ప్రశాంత ధాం ఆలయం కుమురంభీం, మంచిర్యాల జిల్లా వాసులకు సుపరిచిత ప్రదేశం. పెన్‌గంగా, వార్ధా నదుల సంగమ స్థలం ప్రాణహిత జన్మస్థలంలో ఈ దేవస్థానం ఉంది. చెప్రాడలో కార్తీక మçహారాజ్‌ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించిన ప్రశాంత ధాం హనుమాన్‌ ఆలయం ప్రసిద్ధి చెందింది. స్థానిక ప్రజలు మహారాజ్‌గా పిలుచుకునే కార్తీక్‌ స్వామి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టారు.

శ్రీకృష్ణ, రామ, శివ, దుర్గా, సాయిబాబా, గజానన్‌ మహరాజ్‌ ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. మూడేళ్ల క్రితం కార్తీక మహారాజ్‌ పరమపదించగా, ఆయన భక్తులు మహా సమాధిని నిర్మించారు. యేటా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, హనుమాన్‌ జయంతి, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి ఒకటిన నూతన సంవత్సరం సందర్భంగా మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తుంటారు.  

తోగ వెంకటాపూర్‌.. చెట్టుకాండంలో వేంకటేశ్వరుడు 
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చామూర్శి తాలూకాలో మార్కండ ఆలయం ఉంది. గడ్చిరోలి జిల్లాలో ప్రజలు కొలిచే దేవస్థానాల్లో తోగ వెంకటాపూర్‌ ఒకటి. కుమురంభీం, మంచిర్యాల, గడ్చిరోలి జిల్లాల సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. కాగజ్‌నగర్‌ నుంచి కౌటాల, చింతలమానెపల్లి, మహారాష్ట్రలోని అహెరి మీదుగా 80 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణిస్తే తోగ వెంకటాపూర్‌ చేరుకోవచ్చు. ఇక్కడ వేరుమద్ది చెట్టు కాండంలో వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు.

800 ఏళ్ల చరిత ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అహెరి రాజ వంశీయులు తమ కుల దైవంగా భావిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవస్థానం ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. వేల సంవత్సరాల నాటి అరుదైన వృక్షాలు అబ్బుర పరుస్తాయి. చప్పట్లు కొడితే పైకి ఉబికే నీటి ఊటలు మనుషుల అలజడికే ఎగిసిపడే నీటి అలలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  

పులుల అభయారణ్యం.. తాడోబా
జిల్లాకు సమీపంలో ఉండి పర్యాటక ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం తాడోబా. కాగజ్‌నగర్‌ పట్టణం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో చంద్రాపూర్‌ జిల్లా కేంద్రం ఉంది. చంద్రాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఏ సమయంలోనైనా చేరుకోవచ్చు. తాడోబా అటవీ ప్రాంతం చిరుతలు, పెద్ద పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర ఎన్నో రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడోబా సఫారి టూర్‌ వేసవిలో ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.

ఈ అటవీ ప్రాంతంలో పర్యటనకు పలు మార్గాలు ఉండగా, మొహార్లి గేట్‌ మార్గం గుండా వెళ్తే పూర్తిస్థాయిలో అందాలను ఆస్వాదించవచ్చు. పర్యటనకు సఫారి టూర్‌ ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. వాహనానికి నిర్ణీత రుసుం చెల్లించి అటవీ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుంది. పులులు, జింకలు, ఎలుగుబంట్లు,  ఇతర జంతువులను వాటి సహజ స్థితిలో సమీపం నుంచి చూసే అవకాశం పర్యాటకులకు ఉంటుంది.

వసతిపరంగా తాడోబాలో మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌లు, చంద్రాపూర్‌లో పర్యాటకులకు అనువైన ధరల్లో హోటళ్లు, రిసార్చ్టులు ఉన్నాయి. చంద్రాపూర్‌లో మహంకాళి ఆలయం, చంద్రాపూర్‌ కోట, అందమైన పార్కులు సందర్శనీయ స్థలాలు. 

దాబా కొండయ్య మహారాజ్‌ ఆలయం 
కాగజ్‌నగర్‌ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుదైన ఆధ్యాత్మిక స్థలం స్థలం దాబా. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా గోండ్‌పిప్పిరి తాలూకాలోని దాబా విశిష్టత కలిగిన దేవస్థానం. ఇక్కడ సజీవ సమాధి పొందిన కొండయ్య మహారాజ్‌ ఆలయం ఉంది. వీరశైవుడు అయిన కొండయ్య మçహారాజ్‌ ఎన్నో మహిమలు కలిగిన వ్యక్తిగా స్థానికులు చెబుతారు.

నిజాం ప్రభువు ఎదుట మహిమలు చూపించడంతో నిజాం ప్రభువు సైతం ఆశ్చర్యపోయి బహుమతులు అందించారని కథనం. వరంగల్‌లో శిలానందికి గడ్డి తినిపించడం, ఎన్నో రకాల రోగాలను ప్రత్యక్షంగా నయం చేయడం, ఇతర ఎన్నో మహిమలను చూపించిన వ్యక్తిగా స్థానికులు ఆయనను కొలుస్తారు. ఆధ్యాత్మిక భావనలు పెంచడంలో భాగంగా జిల్లాలోని బెజ్జూర్, కాగజ్‌నగర్, సిర్పూర్‌(టి) మండలాల్లో పర్యటించిన ఆయన ఎన్నోరకాల మహిమలు చూపించడాన్ని ఇప్పటికి పెద్దలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.

సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లికి చెందిన అంబేద కొండయ్య మçహారాజ్‌ దాబాలో స్థిరపడ్డారు. ఇప్పటికి ఆయన వంశీకులు లోనవెల్లిలో నివసిస్తున్నారు. 1834లో జన్మించిన ఆయన కార్తీక శుద్ధ తృతీయ 1939 నవంబర్‌ 14న అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం అనుమతితో యోగ సమాధి అయ్యారు. ప్రతిఏటా మాఘశుద్ధ తృతీయ నాడు ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఇక్కడ ఇప్పటికీ ఆయన వంశీయులు పూజలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు