పాటతో అలరిస్తూ.. నటనతో మైమరిపిస్తూ..

16 Dec, 2021 13:36 IST|Sakshi

సాక్షి, మఠంపల్లి (నల్లగొండ):  మండల పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన కొమ్ము బొందయ్య, ఎమీలియా దంపతులకు కుమారుడే సర్వయ్య. వీరిది నిరుపేద కు టుంబం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచే సర్వయ్య పాటలు పాడుతూ గాన గంధర్వుడిగా పేరుగండించాడు. 

పాటలపై మక్కువ పెంచుకుని..
సర్వయ్య గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించాడు. మూడో తరగతి చదువుతున్న రోజుల్లోనే సినిమా పాటలంటే మక్కు వ. ప్రముఖనేపథ్య గాయకుడు మహ్మద్‌ రఫీ ఆలపించిన ‘నా మది నిన్ను పిలిచింది గానమై’ అనే పాటను అచ్చుగుద్దినట్లు పాడి ఔరా అనిపించాడు. అప్పటినుంచి పాఠశాల స్థాయి పాటల పోటీల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. 

సంగీతంపై ఆసక్తితో..
సర్వయ్య ప్రాథమికోన్నత విద్యను గ్రామంలోనే పూర్తి చేసుకున్నాడు. తదనంతరం పదో తరగతి వరకు మండల కేంద్రంలోని  వీవీహెచ్‌ఎస్‌లో అభ్యసించాడు. అయితే, సంగీతంపై ఉన్న ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజనగరం జిల్లా కేంద్రంలోని మ్యూజిక్‌ కాలేజీలో చేరాడు. కాగా, కుటంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మూడేళ్ల కోర్సును ఏడాది వరకే తిరిగి స్వగ్రామానికి వచ్చాడు.

తిరిగి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ  చదువుతూనే గిటార్‌ నేర్చుకున్నాడు. చదువు ఖర్చుల నిమిత్తం బ్యాండ్‌ మేళంలో చేరి చుట్టుపక్కల నిర్వహించే శుభకార్యాలలో ప్రదర్శనలు ఇచ్చేవాడు.  

గానానికే పరిమితం కాకుండా.. 
సర్వయ్య కేవలం గానానికే పరిమితం కాకుండా నాటకాలపై దృష్టిసారించాడు. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాల్లో రాముడు, కృష్ణుడు, హరిచంద్రుడు, అర్జునుడు, బాలవర్తిరాజు తదితర పాత్రలను సత్యహరిశ్చంద్ర, శ్రీకష్ణరాయబారం, బాలనాగమ్మ, రామాంజనేయయుద్ధం, రక్తపిపాసి లాంటి నాటకాల్లో సైతం విజయవాడ, గన్నవరం, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో నటించి మెప్పించాడు.

ముఖ్యంగా తెనాలిలో 2017లో సామ్రాట్‌ అశోక నాటకంలో అశోక చక్రవర్తిగా నటించి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. అంతేగా క తాను వివిధ పాత్రల్లో నటించి  హైదరాబాద్‌లో డాక్టర్‌  అబ్దుల్‌కలాం అవార్డు, డా.బాలసుబ్రహ్మణ్యం అవార్డు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి కళాసమితి అవార్డులు దక్కించుకున్నాడు.

ప్రభుత్వం పోత్సహించాలి
ప్రభుత్వం గ్రామీణ కళాకారులను ఆదుకోవాలి. నైపుణ్యం ఉన్న కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలి. వారికి తగిన సంగీత పరికరాలు అందజేస్తే ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పొందుతారు.

ముఖ్యంగా కాళాకారులకు పింఛన్‌ సౌకర్యం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. పాటలు పాడటం,నాటకాలు వేయడమంటే ఎంతో ఇష్టం. జీవిత కాలం కళామతల్లి సేవలోనే పరితపిస్తా.

– కొమ్ము సర్వయ్య, కళాకారుడు చౌటపల్లి 

చదవండి: గాడిద పాలకు మంచి డిమాండ్‌.. కప్పు పాల ధర ఎంతంటే..

మరిన్ని వార్తలు