కోర్టు బోనులో చేప !

5 Aug, 2020 08:49 IST|Sakshi

సాక్షి,  హన్మకొండ: మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఆరేళ్లుగా వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లల పంపిణీపై ఈ ఏడాది రాజకీయ నీడ పడింది. నిబంధనలకు లోబడి టెండర్లు దాఖలు చేయలేదని పేర్కొంటూ అన్ని టెండర్లను మత్స్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. దీంతో ఈసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉచిత చేప పిల్లల విషయమై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఒకే సంస్థ ఉండడంతో.
వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలతో పాటు సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకే సంస్థ బాధ్యులు ఉచిత చేపపిల్లల పంపిణీకి టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. దీంతోనే టెండర్లను రద్దు చేసినట్లు అనధికారిక వర్గాలు చెబుతున్నాయి. సదరు సంస్థకు దాదాపు దశాబ్దకాలంగా చేపపిల్లల పంపిణీలో అనుభవం ఉన్నా ఈ ఏడాది మాత్రమే టెండర్లను రద్దు చేయడం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి నాలుగు టెండర్లు దాఖలయ్యాయి.

ఇందులో ఒక సంస్థ మాత్రమే నిబంధనలకు లోబడి ఉండగా, మిగతా మూడు సంస్థలను సాంకేతిక కమిటీ పరిశీలన తర్వాత పక్కన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అన్నీ సక్రమంగా ఉన్నట్లు చెబుతున్న ఓ సీడ్‌ సంస్థ బాధ్యులు ఇక్కడే కాకుండా సిద్ధిపేట, నల్లగొండ జిల్లాల్లో సైతం టెండర్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఏ అధికారం లేనప్పటికీ అనేక ఏళ్లుగా సదరు సంస్థ బాధ్యులు కాంట్రాక్ట్‌ దక్కించుకుంటున్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు కొందరు ఓ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. చివరకు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సదరు సంస్థను కూడా బరి నుంచి తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. దీనికి నిబంధనలను సాకుగా చూపెట్టారని మత్స్యశాఖ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

మా వద్ద తనిఖీకి రాలేదు...
నిబంధనలకు లోబడి టెండర్లు వేసినా రద్దు చేయడంతో అధికారుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొండా సుస్మితాపటేల్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తమ సంస్థ సీడ్‌ ప్లాంట్‌ వద్దకు అధికారులెవరూ తనిఖీకి రాలేదని న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఫిషింగ్‌ సీడ్‌ ఫాంలో సుమారు దశాబ్దకాలం అనుభవం కలిగిన తమ సంస్థ టెండర్‌ను రాజకీయ దురుద్దేశంతోనే రద్దు చేశారని పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు మత్స్యశాఖ అధికారుల తీరును తప్పుపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరిగి సదరు సంస్థ టెండర్లను పరిశీలించాలని ఆదేశించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం కాగా, ఉమ్మడి వరంగల్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కోర్టు ఆదేశాలతో తిరిగి టెండర్లు పిలవాలా, గతంలో దాఖలైన టెండరుదారుల నుంచి ఒకరిని ఎంపిక చేయాలా అనే విషయమై అధికారులు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో ఉచిత చేపపిల్లల పంపిణీకి నాలుగు టెండర్లు దాఖలయ్యాయి. అందులో ఒకరి టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉండగా, మిగిలిన మూడు సంస్థలను సాంకేతిక కమిటీ నిపుణులను తోసిపుచ్చారు. ప్రభుత్వం ఈనెల 6నుంచి చేపపిల్లలను పంపిణీ చేయాలని సూచించింది. కానీ ఇక్కడ టెండర్లు కూడా ఖరారు కాని విషయాన్ని మత్స్యశాఖ కమిషనర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి టెండర్లు పిలవాలా లేక ఏం చేయాలనే విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అక్కడి నుంచి అందే ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం.     
– డాక్టర్‌ టి.విజయభారతి, 
మత్స్యశాఖ అధికారి, వరంగల్‌ అర్బన్‌ 

మరిన్ని వార్తలు