బిగ్‌ షాక్‌: కాంగ్రెస్‌కు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా?

15 Mar, 2021 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. పార్టీ వీడతారని  ఎప్పటి నుంచో  సాగుతున్న ప్రచారానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెర దించారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అయితే మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకోవడం గమనార్హం. అనంతరం బీజేపీలో చేరనున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే చేవెళ్ల టికెట్‌పై హామీ రావడంతోనే ఆయన కాంగ్రెస్‌కు బై చెప్పేశారని తెలుస్తోంది.

ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటు కూడా వినియోగించుకున్నారు. ఆ తెల్లారే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పని చేశారు. 2019 ఎన్నికల్లో కూడా చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి లేఖ రాశారు.

పారిశ్రామికవేత్తగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 2013లో రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అనంతరం 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. అయితే 2018లో అకస్మాత్తుగా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కొండా కుటుంబానికి గొప్ప పలుకుబడి ఉంది. ఆయన తాత కొండా వెంకట రంగారెడ్డి. ఆయన తెలంగాణలో రజాకార్లతో పోరాడారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. కొండా దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అమెరికా పౌరసత్వం ఉండి ఎంపీగా పని చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. 

మరిన్ని వార్తలు