ఆక్సిజన్‌ కొరత.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌న్యూస్‌

9 May, 2021 15:37 IST|Sakshi

సాక్షి, హైదరబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో అల్లకల్లోలం సృస్టి‍స్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ కొరత కారణంగానే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నారు. అయితే క‌రోనా సోకిన వీరిలో చాలా వరకు ఆక్సిజ‌న్ స్థాయిలు త‌గ్గ‌డంతోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆక్సిజన్‌ నిరంతర సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి.

కోవిడ్‌ కష్ట కాలంలో ఆక్సిజన్‌ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ శుభవార్త అందించారు.  ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్‌ ద్వారా నైట్రోజన్‌, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిలీండర్లు దొరకడం లేదని, ఒకవేళ దొరికినా తొందరగా అయిపోతుందన్నారు.

జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ కరెంట్‌తో నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని కరెంట్‌ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు. ఇప్పుడే రీఫిల్లింగ్‌ అవసరం లేదని, ఏడాది.. రెండేళ్ల తరువాత మార్చుకోవచ్చన్నారు. వీటిలో ఒకటి యజ్ఞ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన కజిన్‌ అనిత మరో రెండు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక వికారాబాద్‌, చేవెళ్లలో 15, 20 బెడ్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ 

మరిన్ని వార్తలు