కేసీఆర్‌ను గద్దె దింపడమే నా లక్ష్యం

29 Mar, 2021 03:39 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక విధానాలపై పోరాడుతా: కొండా 

మూడు నెలల చర్చల తర్వాత ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం 

టీఆర్‌ఎస్‌కు హరీశ్, ఈటల నాయకత్వం వహిస్తే చేరుతానని వ్యాఖ్య

హైదరాబాద్‌: కేసీఆర్‌ మూడేళ్లు వెంటపడితే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌ పార్టీని వదిలి 10 రోజులు అవుతోందని, తాను కాంగ్రెస్‌లో ఉంటే కేసీఆర్‌కే లాభం జరుగుతుందనే బయటకు వచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉండి కేసీఆర్‌పై గట్టిగా పోరాటం చేయలేనని వ్యాఖ్యానించారు. 10 రోజులుగా కోదండరాం, తీన్మార్‌ మల్లన్న, రాములునాయక్‌తో పాటు ప్రజాసంఘాల నేతలను కలిశానని, అందరినీ ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.

అప్పుడే కేసీఆర్‌కు దీటుగా నిలబడొచ్చని పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా రాజకీయ ఉమ్మడి కార్యాచరణ లక్ష్యంతో ముందుకెళ్తానని చెప్పారు. మూడు నెలల తర్వాత నిర్ణయం కొత్త పార్టీ పెట్టాలా, ఎవరైనా పెడితే కలవాలా, స్వతంత్రంగా ఉండాలా, బీజేపీలో చేరాలా, మళ్లీ కాంగ్రెస్‌లోనే కొనసాగాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై మూడు నెలల చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. హరీశ్, ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు నాయకత్వం వహిస్తే ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలడం వల్లే టీఆర్‌ఎస్‌ గెలిచిందని, మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడటమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో కన్పించట్లేదని విశ్లేషించారు. టీఆర్‌ఎస్‌పై బీజేపీ గట్టి పోరాటం చేస్తే ఆ పార్టీలో చేరుతానని, పీసీసీ అధ్యక్షుడు మారి కాంగ్రెస్‌ గట్టి ఫైట్‌ చేస్తే మళ్లీ అందులో కొనసాగుతానని తెలిపారు. ప్రజల కోసం కొట్లాడటం తనకు ఇష్టమని, అందుకు అవసరమైతే తీన్మార్‌ మల్లన్న లాంటి వాళ్లతో కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ వచ్చాక రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల ప్రజలే అందరి కంటే ఎక్కువ నష్టపోయారని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగు జలాల సాధనకు పోరాటం చేస్తానన్నారు. జీవో 111 మీద కేసీఆర్, కేటీఆర్‌ వెయ్యి సార్లు అబద్ధాలు ఆడారని, దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని కొండా చెప్పారు. 

మరిన్ని వార్తలు