రీచార్జి అయిపోతే కరెంట్‌ కట్‌

26 Mar, 2021 09:32 IST|Sakshi

ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటుకు డిస్కంల కసరత్తు 

ముందుగా 500 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులకు మీటర్ల బిగింపు 

రీచార్జి గడువు ముగియగానే విద్యుత్‌ సరఫరా నిలిపివేత 

సాక్షి, కొందుర్గు(రంగారెడ్డి): విద్యుత్‌ చౌర్యానికి చెక్‌ పెట్టడంతోపాటు, పేరుకుపోతున్న పెండింగ్‌ బకాయిల నుంచి బయటపడేందకు డిస్కంలు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాయి. కొత్తగా ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చి వాటిలో సెల్‌ఫోన్‌లో సిమ్‌ అమర్చిన విధంగా సిమ్‌ ఏర్పాటుచేసి దానికో నంబర్‌ కేటాయించనుంది. సంబంధిత నంబర్‌కు ముందుగా రీచార్జి చేసుకుంటేనే నిర్ణీత వ్యవధి వరకు విద్యుత్‌ సరఫరా జరుగుతుందని కొందుర్గు ట్రాన్స్‌కో ఏఈ వినయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రీచార్జి కాలం ముగిసిన వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని, తిరిగి రీచార్జి చేసుకుంటేనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించబడుతుందని తెలిపారు. 

ముందుగా 500 యూనిట్లు, ఆపై వినియోగదారులకు.. 
కేంద్ర ప్రభుత్వం 15శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం, డిస్కమ్‌ సంస్థ 75 శాతం నిధులతో ముందుగా గ్రామాల్లో విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఆన్‌ఆఫ్‌ సిస్టమ్‌ తదితర అన్ని సమస్యలను పరిష్కరించనుంది. ఈ పనులన్నీ పూర్తయిన వెంటనే పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్‌ విధానం అమల్లోకి వస్తుంది. ముందుగా నెలకు 500, ఆపై యూనిట్ల విద్యుత్‌ వినియోగించే వినియోగదారులకు సంబంధించిన మీటర్లకు ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చడం జరుగుతుంది. అనంతరం విడతల వారీగా అందరు వినియోగదారులకు మీటర్లు అమర్చనున్నారు.

విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌ ద్వారా డిస్కమ్‌కు చేరుతాయి. అనుకోకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఎమర్జెన్సీ సర్వీస్‌ కింద ఒకగంట పాటు లోను అందజేసి విద్యుత్‌ సరఫరా చేయడం జరుగుతుంది. తదుపరి రీచార్జి చేసుకున్న తేదీ నుంచి లోను తీసుకున్న మొత్తం కట్‌చేయబడుతుంది. వినియోగదారులు విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఫోన్‌ నంబర్‌ను లింక్‌ చేసుకోచ్చు.

జిల్లాలో వెయ్యికి పైనే డిజిటల్‌ మీటర్ల బిగింపు
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక వెయ్యి డిజిటల్‌ మీటర్లకు పైనే బిగించడం జరిగింది. ఇందులో భాగంగా కొందుర్గు మండలంలో తహసీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, చౌదరిగూడ 
తహసీల్దార్‌ కార్యాలయంతోపాటు పలు గ్రామాల్లోని పాఠశాలలకు ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చారు. త్వరలో జిల్లాలోని అన్నిచోట్ల ప్రీపెయిడ్‌ మీటర్లు బింగించేందుకు డిస్కంలు  కసరత్తు చేస్తున్నాయి.
– వినయ్‌కుమార్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ, కొందుర్గు  

మరిన్ని వార్తలు