ఎవరూ లేకున్నా.. కడసారి వీడ్కోలుకు ఆ నలుగురు

19 Apr, 2021 08:47 IST|Sakshi

కోవిడ్‌ మృతులకు దహన సంస్కారాలు చేస్తున్న యువకులు

బాధిత కుటుంబీకులు, బంధువులు ముందుకురాని క్షణాన కడసారి వీడ్కోలు

ఆదర్శంగా నిలుస్తున్న కోరుట్ల యువత 

కోరుట్ల: కరోనా వైరస్‌ ఆత్మీయత, అనుబంధాలకు అడ్డు తెరలు కడుతోంది. చివరి చూపు.. స్పర్శకు నోచుకోకుండా నా అన్నవాళ్లను దూరం చేస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరూ దరిచేరని దయనీయ స్థితిలో కరోనా మృతుల అంత్యక్రియలను తమ భుజాలపై వేసుకుంటున్నారు కోరుట్లకు చెందిన పలువురు యువకులు. భయానక వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంటే ధైర్యం కోల్పోకుండా మానవత్వంతో మృతదేహాలకు కడసారి వీడ్కోలు పలుకుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  

వారం వ్యవధిలో 12 మంది మృతి...
కోరుట్ల పరిసర ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో 12 మంది కరోనాతో జగిత్యాల, కరీంనగర్, హైద్రాబాద్‌లలోని ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు భయపడి, దగ్గరికి కూడా రాలేదు. ఎక్కడ కరోనా వైరస్‌ తమకు సోకుతుందోనని ఆందోళన చెంది, దూరంగా ఉన్నారు. అంతటా ఓదార్పు మాటలే తప్ప దహన సంస్కారాలు చేసేందుకు సాహసించని పరిస్థితి. అన్నిచోట్లా ఇది నిత్యకృత్యమవుతోంది.   

యువత బాసట..  బాధితులకు ఊరట
కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు భయపడుతున్న నేపథ్యంలో కోరుట్ల యువత తామున్నామని ముందుకు రావడం బాధిత కుటుంబాలకు ఊరటనిస్తోంది. కోరుట్ల పట్టణంలో ఇప్పటివరకు చనిపోయిన 12 మందికి స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు, మానవ సందేశ సమితి ఆధ్వర్యంలోని ఇందాదుల్‌ ముస్లిమీన్‌ యూత్‌ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న యువకులను ప్రతిఒక్క రూ అభినందిస్తున్నారు.

మానవత్వంతో చేస్తున్నాం..
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబీకులు, బంధువులు ముందుకు రావడం లేదు. బీజేపీ, బీజేవైఎం నాయకులందరం కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడ్డాం. మానవత్వంతో కోవిడ్‌ మృతులకు దహన సంస్కారాలు చేస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు 45 మందికి అంత్యక్రియలు నిర్వహించాం. 
– మాడవేని నరేష్, బీజేపీ ఫ్లోర్‌ లీడర్, కోరుట్ల

ఎంతో పుణ్యం..
కరోనాతో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వైరస్‌తో ఎక్కడ ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు చేసేందుకు మా యువత ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కరోనా ప్రారంభంలో మానవత్వ సందేశ సమితి ప్రోత్సాహంతో మృతులకు అంత్యక్రియలు పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. 
– అలీమొద్దీన్, ఇందాదుల్‌ ముస్లిమీన్‌ యూత్‌ అధ్యక్షుడు, కోరుట్ల 

( చదవండి: వ్యాక్సిన్‌ వికటించి వ్యక్తి మృతి?

మరిన్ని వార్తలు