ప్రేమజంట నిర్వాకం: పెద్ద కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బుతో రెండో కూతురు

10 Feb, 2022 19:42 IST|Sakshi

సాక్షి, కోరుట్ల(కరీంనగర్‌): ఆ తండ్రికి ముగ్గురు కూతుళ్లు.. పొట్టచేత పట్టుకుని ఎడారి దేశం వెళ్లాడు.. కడుపు కట్టుకుని.. పైసాపైసా కూడబెట్టుకున్నాడు.. ఆ సొమ్ముతో ముందుగా పెద్దకూతురు వివాహం చేయాలని నిశ్చయించాడు.. కానీ, ప్రేమికుడితో కలిసి రెండోకూతురు ఆ సొమ్మును పట్టుకుని ఎటో వెళ్లిపోయింది.. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్నెగూడేనికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి వెతుక్కుంటూ రెండేళ్లక్రితం దుబాయ్‌ వెళ్లాడు. తన ముగ్గురు కూతుళ్లలో పెద్దకూతురు వివాహం చేద్దామని భావించాడు. నెలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇన్నాళ్లూ కూడబెట్టిన రూ.6.40లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో నిల్వచేశాడు.

            బాధితుడికి డబ్బు అందిస్తున్న సీఐ రాజశేఖర్‌రాజు  

గమనించిన ఆయన రెండో కూతురు.. ఆ సొమ్ము తీసుకుని తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి పదిరోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తండ్రి.. ఈ విషయంపై కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ.. మేడిపెల్లి ఎస్సై సుధీర్‌రావు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, విజయ్‌తో కలిసి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ బృందం ఖమ్మం జిల్లా కూసుమంచిల ఆ ప్రేమజంటను గుర్తించి చాకచక్యంగా పట్టుకుంది. బుధవారం సీఐ రాజశేఖర్‌రాజు ఎదుట హాజరుపర్చింది.

ఆ జంటనుంచి రూ.6లక్షలు రికవరీ చేశారు. పోలీసు బృందాన్ని మెట్‌పల్లి డీఎస్పీ రవీంద్రరెడ్డి అభినందించారు. ఈ సొమ్మును సీఐ రాజశేఖర్‌రాజు బాధితుడికి అందజేశారు. తన పెద్దకూతురు వివాహం కోసం దాచిన సొమ్ము మళ్లీ తన వద్దకు రావడంతో ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. సీఐ మాట్లాడుతూ, యువత తల్లిదండ్రులను నమ్మించి ప్రేమపేరిట మోసపోవద్దని సూచించారు. ఎస్సైలు సతీశ్, శ్యామ్‌రాజ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు