పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షం

6 Sep, 2022 07:54 IST|Sakshi
కోటం సందీప్‌ భరద్వాజ్‌

గత నెల 10న నారాయణగూడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు  

నిందితుడిని అరెస్టు చేయడంలో జాప్యం 

సోమవారం ముందస్తు బెయిల్‌తో పీఎస్‌లో ప్రత్యక్షం

సాక్షి, హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): నర్సుపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు రాంనగర్‌కు చెందిన కోటం సందీప్‌ భరద్వాజ్‌ ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు వైద్యుడు పరారీలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ లోగా అతడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు.

న్యాయస్థానం సోమవారం నిందితుడు కోటం సందీప్‌ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పేపర్లతో  నిందితుడు, అతడి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. హిమాయత్‌నగర్‌లోని మ్యానికైండ్‌ ఆసుపత్రిలో బాధితురాలు నర్సుగా, సందీప్‌ భరద్వాజ్‌ వైద్యుడిగా చేసేవారు. నైట్‌షిఫ్ట్‌లో ఉన్న నర్సును పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో దాడి చేయడంతో ఆమె గత ఏడాదిలో రెండు సార్లు నారాయణగూడ పోలీసుల్ని ఆశ్రయించింది.

చదవండి: (Hyderabad: నైట్‌ డ్యూటీ.. నమ్మించి నర్సుపై వైద్యుడి లైంగికదాడి) 

అప్పట్లో  పోలీసు అధికారి అతడికి వార్నింగ్‌ ఇవ్వడంతో పోలీసుల ఎదుటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆర్య సమాజ్‌కు వెళ్లి వెనక్కి తీసుకొచ్చాడు. ఇటీవల మరోమారు పెళ్లి ప్రస్తావన తేవడంతో తన రాజకీయ పలుకుబడితో ఆమెను బెదిరింపులకు గురి చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భరద్వాజ్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. సుమారు 25 రోజుల పాటు నిందితుడి ఆచూకీ తెలియలేదు. పరారీలో ఉన్నట్లు పోలీసులు కాలయాపన చేశారు. అతడిని అరెస్టు చేయకుండా, ముందస్తు బెయిల్‌ వచ్చేలా పోలీసులు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.    

మరిన్ని వార్తలు