ప్రభుత్వ వైద్యులు.. భేష్‌

14 Nov, 2021 04:08 IST|Sakshi
డిశ్చార్జి సందర్భంగా సమ్మయ్యను అభినందిస్తున్న కొత్తగూడెం ఆస్పత్రి వైద్యులు   

అరుదైన సర్జరీ చేసిన భద్రాద్రి జిల్లా డాక్టర్లను అభినందించిన మంత్రి హరీశ్‌రావు

కొత్తగూడెం రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యులకు మరోమారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నుంచి ప్రశంసలు దక్కాయి. గత నెల 26న అడవి దున్న దాడిలో పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన సమ్మయ్య ముఖం ఛిద్రం కావడంతోపాటు ఎడమ కన్ను దెబ్బతినగా, డవడ ఎముక, కుడి పక్క ఆరు పక్కటెముకలు విరిగాయి.

దీంతో ఆయనను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ముక్కంటేశ్వరావు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ రవిబాబు నేతృత్వంలో జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్, ఎండీ ఫిజీషియన్‌ డాక్టర్‌ వెంకన్న, డాక్టర్‌ నవీన్‌లు ఫేషియల్‌ రీ కన్‌స్ట్రక్టన్‌ సర్జరీ చేశారు. ఈ సర్జరీకి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనైతే రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. సర్జరీ ద్వారా వెంకన్న ముఖం పూర్వ స్థితికి చేరుకోవడంతో శనివారం డిశ్చార్జి చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ట్విట్టర్‌ వేదికగా డాక్టర్లను అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నామనడానికి సమ్మయ్య ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు