కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో అసభ్యకర ప్రవర్తన

9 Apr, 2022 03:00 IST|Sakshi
కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మిని ఓదారుస్తున్న ఎమ్మెల్యే వనమా 

ర్యాలీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట 

మాజీ కౌన్సిలర్‌పై ఎస్పీ, అధిష్టానానికి సీతాలక్ష్మి ఫిర్యాదు

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్‌: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్‌ను, మాజీ కౌన్సిలర్‌ యూసుఫ్‌ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్‌ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్‌తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్‌ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు.

నేను మహిళను, దండం పెడతా అన్నా.. 
‘నేను ప్రయాణిస్తున్న బైక్‌ను యూసుఫ్‌ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు.

అనంతరం కొత్తగూడెం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్‌పర్సన్‌ డ్రైవర్‌ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్‌పర్సన్‌ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్‌ మరో వీడియోలో స్పందించారు.

మరిన్ని వార్తలు