మనకూ ఓ వైట్‌హౌస్‌!

26 Nov, 2020 08:18 IST|Sakshi
ఇది కోఠి రెసిడెన్సీ ముందు భాగం..

పల్లాడియన్‌ నిర్మాణ శైలిలో హైదరాబాద్‌లోనూ ఓ భవనం

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను ఎప్పుడైనా చూశారా? క్రీస్తుపూర్వం ఓ వెలుగు వెలిగిన  గ్రీక్‌–రోమన్‌ నిర్మాణ శైలిని 15వ శతాబ్దంలో పునరుద్ధరించాక ఆ శైలిలో రూపుదిద్దుకున్న గొప్ప నిర్మాణాల్లో ‘వైట్‌హౌస్‌’ కూడా ఒకటి. ఆ భవనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఓసారి హైదరాబాద్‌లోని కోఠికి వెళ్లండి సరిపోతుంది!

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలోని కోఠిలో ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలగా వెలుగొందుతున్న బ్రిటిష్‌ రెసిడెన్సీ భవనం చూడటానికి వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలానే ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు భవనాలకు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా పల్లాడియన్‌ శైలి, సమకాలీన పరిస్థితులు ఈ రెండు భవనాలకు పోలిక తెచ్చిపెట్టాయి.  శైలిలోనే కాదు... నిర్మాణ సమయం కూడా ఈ రెండు భవనాలకూ ఇంచుమించు ఒక్కటే. వైట్‌హౌస్‌ నిర్మాణం 1792లో ప్రారంభమై 1800 సంవత్సరంలో ముగియగా 1803లో బ్రిటిష్‌ రెసిడెన్సీ రూపుదిద్దుకుంది.
  
వైట్‌ హౌస్‌ ముందు భాగం
నిర్మాణ ప్రత్యేకతలెన్నో..
అంతెత్తున కనిపించే భారీ స్తంభాలు.. వాటిపై ఐకా నిక్‌ క్యాపిటల్‌.. దానిపైన త్రికోణాకారంలో పెడిమెంట్‌. దర్బారు హాలుకు ప్రవేశ మార్గ భారీతనం.. దానికి రెండు వైపులా రెండంతస్తుల భారీ గదులతో కూడిన భవంతులు.. లోనికి ప్రవేశించేందుకు ఎత్తయిన మెట్ల వరుస.. అర్ధ వృత్తాకారంలో పోర్టికో న మూనాలో వెనుక వైపు ప్రవేశద్వారం.. దానికి ఆధారంగా డబుల్‌ హైట్‌ కాలమ్స్‌.. లోనికి వెళ్లగానే ద ర్బార్‌ హాల్‌.. అది కూడా డబుల్‌ హైట్‌ బాల్కనీల నిర్మాణం.. ఇవన్నీ కోఠిలోని బ్రిటిష్‌ రెసిడెన్సీ ప్రత్యేకతలు.ఇక్కడ కళ్లు మూసుకొని ‘వైట్‌హౌస్‌’ ముందు తెరిస్తే దాదాపు అదే శైలి నిర్మాణం కనిపిస్తుంది.

బ్రిటీష్‌ రెసిడెన్సీ భవనం వెనక భాగం ఇలా.. 

కలిపింది పల్లాడియన్‌ శైలి..
‘వైట్‌హౌస్‌’కు మన కోఠి భవనానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒకే తరహా శైలి రెండింటినీ జోడించింది. ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్‌ ఆండ్రూ పల్లాడియో 15వ శతాబ్దంలో కొత్త నిర్మాణ శైలికి బీజం వేశారు. క్రీస్తుపూర్వం గ్రీక్‌–రోమన్‌ నిర్మాణ శైలికి ఆధునికతను జోడిస్తూ పునరుద్ధరించారు. దానికి ప్రపంచం మంత్రముగ్ధమైంది. ఎన్నో నిర్మాణాలను ఆ రూపులో తీర్చిదిద్దిన ఆయన.. ఆ నిర్మాణ శైలికి సంబంధించి నాలుగు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఆ తరహా నిర్మాణశైలి పల్లాడియన్‌ డిజైన్‌గా పేరుగాంచింది. ఆ తర్వాత పల్లాడియన్‌ శైలిని తిరిగి బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ జోమ్స్‌ ఇటలీకి వెళ్లి చదువుకొని మరీ పునరుద్ధరించారు. ఇది బాగా నచ్చి హైదరాబాద్‌లో బ్రిటిష్‌ రెసిడెంట్‌గా ఉన్న కిర్క్‌ ప్యాట్రిక్‌ అదే నమూనాలో రెసిడెన్సీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను మద్రాస్‌ ఇంజనీర్స్‌కు చెందిన శామ్యూల్‌ రసెల్స్‌కు అప్పగించారు. దాదాపు అదే సమయంలో జేమ్స్‌ హోబన్‌ అనే అమెరికా ఆర్కిటెక్ట్‌ ‘వైట్‌హౌస్‌’కు ప్రాణం పోశారు.

వెనక పోర్టికో ప్రవేశమార్గం ఇలా 
భవనాన్ని కాపాడే ప్రయత్నమేదీ..?
సమకాలీన నిర్మాణాలే అయినప్పటికీ ‘వైట్‌హౌస్‌’ తళతళా మెరిసిపోతుంటే కోఠిలోని బ్రిటిష్‌ రెసిడెన్సీ మాత్రం ఎప్పుడు కూలుతుందో తెలియనంతగా శిథిలావస్థకు చేరింది. 1949లో ఇది మహిళా కళాశాలగా మారినా భవనాన్ని కాపాడేందుకు పెద్దగా ప్రయత్నం జరగలేదు. త్వరలో కొలువుదీరే జీహెచ్‌ఎంసీ కొత్త పాలకవర్గం దీనిపై దృష్టి సారించి పురావస్తుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకొని దీన్ని హైదరాబాద్‌ షాన్‌లలో ఒకటిగా తీర్చిదిద్దాలన్న వినతులు చరిత్రకారుల నుంచి వస్తున్నాయి.

భావితరాలకు చూపించాలి..
బ్రిటిష్‌ రెసిడెన్సీ భవనం పల్లాడియన్‌ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న గొప్ప నిర్మాణం. అమెరికా వైట్‌హౌస్‌ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ శైలిలో ఎన్నో భవనాలున్నాయి. గ్రీన్‌విచ్‌లోని క్వీన్స్‌ హౌస్, బర్లింగ్టన్స్‌ హోమ్‌ చిస్విక్‌ హౌస్, ఇంగ్లండ్‌లోని క్లేర్‌మంట్‌ హౌస్, కోల్‌కతాలోని గవర్నమెంట్‌ హౌస్‌లు వాటికి నిదర్శనం. గొప్ప నిర్మాణశైలికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న బ్రిటిష్‌ రెసిడెన్సీ భవనాన్ని కాపాడి భావితరాలకు చూపించాలి.
– వసంత శోభ తురగ, కన్జర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌

మరిన్ని వార్తలు