ఆ 37 ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి

27 Jul, 2021 00:51 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీజలాలను వినియోగిస్తూ నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన మొత్తం 37 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ స్పెషల్‌ సీఎస్‌కు లేఖ రాసింది. డీపీఆర్‌లు సమర్పించాలని ఇప్పటికే కోరినా రాష్ట్రం ఇంతవరకు స్పందించలేదని గుర్తు చేసింది. బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వకుండా, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని గతంలో లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేసింది.  

ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో.. 
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల రెండు వేర్వేరు లేఖల్లో బోర్డును కోరింది. ఇప్పటికే ఆరింటిని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తోందని ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదు చేసిన ప్రాజెక్టుల్లో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అలాగే కొత్తగా చేపడతామని ప్రకటించిన జోగుళాంబ బ్యారేజీ, భీమాపై వరద కాల్వ, కల్వకుర్తి పరిధిలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, పులిచింతల పరిధిలో ఎత్తిపోతలు, సాగర్‌ టెయిల్‌పాండ్‌లో ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి.

కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో 13 ఎత్తిపోతల పథకాలను చేపట్టేలా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా ఏపీ తెలిపింది. ఏపీ లేఖల నేపథ్యంలో స్పందించిన బోర్డు తాజాగా తెలంగాణకు లేఖ రాసింది. కాగా, శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామంటూ ఏపీ చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం తెలియజేయాలని, మరో లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది.   

మరిన్ని వార్తలు